Periods Pain Relief Tablet Side Effects:పీరియడ్స్ సమయంలో కడుపు, నడుం నొప్పి వంటి శారీరక నొప్పులు సహజంగానే ఉంటాయి. అయితే నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు కొంతమంది పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు. కానీ, ఈ మాత్రలు తరచూ వాడడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. వీటిని వాడడం వల్ల పలు అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరి, ఏంటా సమస్యలు? నెలసరి సమయంలో నొప్పి నివారణ మాత్రలు ఎందుకు వేసుకోకూడదు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నొప్పి ఎందుకు వస్తుంది?
నెలసరి సమయంలో మన శరీరంలో ప్రొస్టాగ్లాడిన్స్ అనే పదార్థాలు విడుదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి గర్భాశయంపై ఒత్తిడి కలుగజేస్తూ బ్లీడింగ్ రూపంలో రక్తాన్ని బయటికి పంపిస్తాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే పొత్తి కడుపులో నొప్పి, ఇంకా నడుం నొప్పి, ఇతర శారీరక నొప్పులకూ ఈ ప్రక్రియ కారణమవుతుందని వెల్లడిస్తున్నారు. అయితే చాలామంది మహిళల్లో ఈ నొప్పి మోస్తరుగా ఉంటుందని.. కొందరిలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉందంటే ప్రొస్టాగ్లాడిన్స్ అధికంగా ఉత్పత్తైనట్లుగా అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇవి ఎక్కువగా ఉత్పత్తవడం వల్ల దీర్ఘకాలంలో ఫైబ్రాయిడ్లు, సిస్టులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే గైనకాలజిస్ట్‌ని సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
పెయిన్ కిల్లర్స్ వాడచ్చా?
సాధారణంగా కొంతమందిలో పీరియడ్స్ సమయంలో మొదటి రెండు లేదా మూడు రోజుల పాటు నొప్పి తీవ్రంగా ఉంటుంది. దీంతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం చాలామందికి అలవాటు. అయితే ఇలా సొంత వైద్యం కాకుండా.. డాక్టర్ సలహా మేరకు మాత్రమే వీటిని వాడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకా అత్యంత అరుదుగా మాత్రమే వాడాలని.. అలాకాకుండా వీటి మోతాదు ఎక్కువైనా, పదే పదే వేసుకున్నా జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని అంటున్నారు.
ఎలాంటి సమస్యలొస్తాయంటే?
పీరియడ్స్ సమయంలో తలెత్తే హార్మోన్ల అసమతుల్యత జీర్ణ వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా మలబద్ధకం సమస్య వస్తుందని వివరిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటే సమస్య మరింత తీవ్రం అవుతుందని అంటున్నారు. పెయిన్ కిల్లర్స్ వల్ల కొంతమందిలో విరేచనాలు కూడా అవుతాయని నిపుణులు పేర్కొన్నారు.
- ఇంకా మోతాదుకు మించి పెయిన్ కిల్లర్స్ వాడితే పొట్టలో ఆమ్లత్వం పెరిగి ఆహార వాహిక ద్వారా అది పైకి ఉబికి వస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫలితంగా గొంతులో, గుండెలో మంట, వికారం-వాంతులు, కడుపు నొప్పి మరింత తీవ్రవమడం, ఛాతీ పట్టేయడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
- సాధారణంగానే పీరియడ్స్ వచ్చినప్పుడు నీరసంగా, అలసటగా అనిపిస్తుంటుంది. అయితే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్‌ని వేసుకుంటే శరీరం మరింత నీరసించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఏ పనీ చేసుకోలేరని వివరిస్తున్నారు.
- పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల కాలేయం పనితీరు దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. 2018లో Journal of Clinical and Translational Hepatology (JCTH) ప్రచురితమైన "Acetaminophen-Induced Liver Injury: Mechanisms and Clinical Implications" అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది.
- నొప్పి వచ్చిన ప్రతిసారీ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో పొట్టలో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రల వల్ల మగతగా అనిపించడం, ఒత్తిడి-ఆందోళన వంటి మానసిక సమస్యలూ వేధిస్తాయని నిపుణులు అంటున్నారు.
- పెయిన్ కిల్లర్స్ ఆకలినీ దెబ్బతీస్తాయని.. వేళకు ఆకలేయక, సరైన ఆహారం తీసుకోక మరింత నీరసించిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
- ఇవే కాకుండా.. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడం, చర్మ సమస్యలు వంటివీ కొంతమందిలో అరుదుగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.