Weight Loss Without Dieting:మనలో చాలా మంది బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు కఠినమైన వ్యాయమాలు మొదలుపెడితే.. మరికొందరు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటుంటారు. ఇంకొందరైతే డైటింగ్ పేరుతో పూర్తిగా తినడాన్నే మానేస్తుంటారు. కానీ దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే డైటింగ్‌తో పనిలేకుండా బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉండొచ్చని వివరిస్తున్నారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర తగ్గించాలట
బరువు తగ్గాలని అనుకొనేవారు చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండే పానీయాలు, ఆహార పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే చక్కెర శరీరంలోకి చేరి.. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి చక్కెర వేయకుండా తయారు చేసిన నిమ్మరసం, పండ్ల రసాలు, నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. దీనివల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండచ్చని పేర్కొన్నారు.
కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి
డైటింగ్ చేయకుండానే బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఆహారంలో కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా వీటిని సలాడ్స్ రూపంలో లేదంటే ఉడికించుకుని కూడా తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఒకవేళ ఇలా తినాలనిపించకపోతే వాటిపై కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే రుచిగా ఉండడమే కాకుండా బరువు కూడా తగ్గుతారని వివరిస్తున్నారు.
విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలట
నిద్రలేమి వల్ల ఎదురయ్యే సాధారణ సమస్య బరువు పెరగడం. కాబట్టి రాత్రుళ్లు కనీసం ఏడెనిమిది గంటల పాటు హాయిగా.. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిద్ర పోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే ఖాళీగా ఉన్నప్పుడు అనవసరమైన పనులతో సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రశాంతంగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా శరీరానికి, మనసుకు విశ్రాంతి లభించి తద్వారా బరువు కూడా అదుపులో ఉంటుందని వివరిస్తున్నారు.
గ్రీన్ టీతో
బరువు తగ్గడానికి చాలా మంది నిపుణులు గ్రీన్ టీ తాగాలని సూచిస్తుంటారు. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు త్వరగా కరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని 2018లో "అపెటైట్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధనలో యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్. అకిర ఇమాముర (Dr. Akira Imamura) పాల్గొన్నారు. కాబట్టి డైటింగ్ అవసరం లేకుండా బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)