Is Any Relation Between Menopause and Constipation:ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్యలలో మలబద్ధకం కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారికి కడుపులో అసౌకర్యంగా... ఇబ్బందిగా ఉంటుంది. మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి కారణాలు అంటే బోలెడు ఉన్నాయి. కదలకుండా కూర్చునే జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, తగినన్ని నీరు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, బలహీనమైన జీవక్రియలు, రాత్రిళ్లు ఆలస్యంగా తినడం లేదా అసలే తినకపోవడం వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి మాత్రమే కాకుండా మెనోపాజ్ దశలో ఉన్నవారికి కూడా మలబద్ధకం సమస్య ఉంటుందా? అంటే నిజమే అంటున్నారు నిపుణులు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెనోపాజ్ దశలో మలబద్ధకం సమస్య కనిపించడం సాధారణమని పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల అంటే.. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్‌ల హెచ్చు తగ్గుల వల్ల జీర్ణ ప్రక్రియ వేగం మందగిస్తుందని.. దీనికి తోడు ఆడవారిలో వయసు పెరిగే కొద్దీ పెల్విక్ కోర్ మజిల్స్ బలహీనమవుతాయని అంటున్నారు. అలానే, కొన్నిరకాల మందులు అంటే థైరాయిడ్, బీపీ, ఐరన్ మాత్రలతో పాటు యాంటీ డిప్రెసెంట్స్ వల్ల కూడా ఇలా కావొచ్చని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పలు పరిశోధనలు సైతం చెబుతున్నాయి.
2002లో మెనోపాజ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మెనోపాజ్ తర్వాత మహిళల్లో మలబద్ధక సమస్య 29% అధికం అని కనుగొన్నారు. ఈస్ట్రోజెన్ స్థాయిలలో తగ్గుదల మలబద్ధకానికి ప్రధాన కారణమని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనా మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ షాంఘైలో అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ డాక్టర్ జున్‌లాంగ్ జాంగ్ పాల్గొన్నారు.
మెనోపాజ్‌లో మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఆహారపు అలవాట్లతో పాటు కొన్ని వ్యాయామాల ద్వారా అదుపులో ఉంచుకోవచ్చని పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి చెబుతున్నారు. అధిక పీచు ఉండే పదార్థాలు తీసుకోవడం ప్రారంభించాలని సూచిస్తున్నారు. అంటే.. చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పాలిష్ పట్టని గోధుమలు, మొక్కజొన్నల నుంచి వచ్చిన పిండి, క్వినోవా, రవ్వలతో చేసినవన్నీ తీసుకోవాలని అంటున్నారు.
పప్పులు: బొబ్బర్లు, శనగలు, పెసర్లు వంటివి తరచూ తినాలని అంటున్నారు. అంతేకాకుండా కాలానుగుణంగా స్థానికంగా దొరికే పండ్లు తినాలని.. బత్తాయి, జామ, బొప్పాయి.. వంటివాటిల్లోనూ అధిక మోతాదులో పీచు లభిస్తుందని.. వీటిని తినడం వల్ల కూడా సమస్య తగ్గుతుందని అంటున్నారు.