ICMR Advice to Avoid Tea or Coffee Before and After Meals: టీ, కాఫీ.. చాలా మందికి ఇవి తీసుకోకపోతే రోజు గడవదు. మరికొందరైతే గంటకోసారి వీటిని తాగుతుంటారు. టీ, కాఫీ తాగితే మైండ్ రిలాక్స్‌గా ఉంటుందని సమయంతో సంబంధం లేకుండా సేవిస్తుంటారు. భోజనానికి ముందు, తర్వాత వేడి వేడిగా తాగేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే.. ఇలా భోజనానికి ముందు తర్వాత వీటిని తీసుకోవడం అత్యంత ప్రమాదకరమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజాగా వెల్లడించింది. దీనివల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. వాటికి దూరంగా ఉండాలని సూచించింది.
మెరుగైన ఆరోగ్యం కోసం ఐసీఎంఆర్ పలు రకాల మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఆహార సమతుల్యత ఎంతో అవసరమని సూచించింది. భోజనం చేయడానికి గంట ముందు.. ఆ తర్వాత గంట వరకు కాఫీ, టీలను తీసుకోవడం హానికరమని హెచ్చరించింది. జాతీయ పోషకాహార సంస్థ (NIN) విభాగం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
ఎందుకంటే.. టీ, కాఫీలో కెఫీన్, టానిన్లు ఉంటాయి. కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థపై.. టానిన్ ఆహారంలో ఉండే ఐరన్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. ఆహారం తీసుకునే సమయంలో దానిలో ఉండే ఐరన్ శాతాన్ని టానిన్ తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్‌ను తయారుచేసేందుకు ఐరన్ చాలా అవసరం. ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ సరఫరాలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ పానీయాల్లో ఉండే టానిన్లు ఐరన్ శోషణ ప్రక్రియలో అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని.. అందుకే భోజనం తీసుకునేముందు ఆ తర్వాత కొంత సమయం పాటు వీటిని తీసుకోకపోవడమే మంచిదని సూచించింది. ఎందుకంటే మనం తీసుకునే ఒక కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీ గ్రాములు.. ఇన్‌స్టంట్ కాఫీలో 50- 65 mgల కెఫీన్ ఉంటుంది. అదే టీలో 30-65 mg కెఫీన్ ఉంటుంది.
2016లో "న్యూట్రిషన్ రివ్యూస్" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. టీ, కాఫీ రెండూ ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయని కనుగొన్నారు. టీ తాగడం వల్ల 50% వరకు ఐరన్ గ్రహించకుండా అడ్డుకుంటుందని, కాఫీ 30% వరకు ఐరన్ గ్రహించకుండా అడ్డుకుంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో USAలోని మయో క్లినిక్‌లోని పోషకాహార శాస్త్రజ్ఞుడు Dr. Michael F. McCarty, Ph.D పాల్గొన్నారు.