Weight Loss Tips in Telugu: మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. రకరకాల కారణాలు మనం బరువు పెరగడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది మరిన్ని సమస్యలకు దారితీయకుండా ఉండాలంటే ముందుగానే దీన్ని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే, బరువు తగ్గే ప్రయత్నంలో కొన్ని తప్పుల్ని అస్సలు చేయొద్దని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మంది బరువు తగ్గేందుకు ఒక పూట అన్నం మానేస్తుంటారు. బరువు తగ్గాలంటే తినే ఆహారంపై నియంత్రణ ఉండాలన్న మాట నిజమే కానీ, ఇలా ఆహారం తినకపోతే తగ్గిపోతామనుకోవడం మాత్రం అపోహే అంటున్నారు నిపుణులు. ఈ ప్రయత్నం మన జీవక్రియ వేగాన్ని తగ్గిస్తుందని.. ఆ ప్రభావం తర్వాత తినేటప్పుడు అదుపు తప్పేలా చేస్తుందని తెలిపారు. అందుకోసమే సమతులాహారాన్ని, ఆరోగ్యకరమైన చిరుతిళ్లను మీ డైట్‌లో చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ అలవాటు మీ జీవక్రియల్ని చురుగ్గా ఉంచడమే కాకుండా.. ఊబకాయాన్నీ నియంత్రిస్తుందని వివరిస్తున్నారు.
ఫ్యాడ్ డైట్ జోలికి పోవద్దు
ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండానే కొన్ని రకాల డైట్‌లు తెగ పాపులర్ అయ్యాయి. ఫలితంగా వాటిని అనుసరిస్తూ కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవడం, పూర్తిగా కెలరీలు లేకుండా చూసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే, ఇవి కొన్నిరోజులు ప్రభావవంతంగా కనిపించినప్పటికీ ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంలో శరీరానికి సమతులంగా పోషకాలు అందకపోవడంతో అనారోగ్యాల బారిన పడొచ్చని.. ప్రాణాలకీ ముప్పు రావొచ్చని వెల్లడిస్తున్నారు. అందుకే వీటికి బదులుగా రోజూ కలర్‌ఫుల్ మీల్ అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలతో కూడిన భోజనానికి ప్రాధాన్యం ఇస్తే ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
అతి వద్దు సుమీ!
మనలో కొంతమంది ఆరోగ్యానికి మంచిదనీ, పోషకాలు ఎక్కువగా ఉంటాయనీ నట్స్, అవకాడో, తృణధాన్యాలు వంటి పదార్థాలను అతిగా తింటుంటారు. అయితే, ఏదైనా అతి ప్రమాదమే అన్న విషయం గుర్తుంచుకోవాలని నిపుణులు అంటున్నారు. మన శరీర అవసరాలకు అనుగుణంగా తగు మోతాదులోనే వేటినైనా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి బరువుని తగ్గించడాన్ని పక్కకు పెడితే.. కొన్నిసార్లు మరింత పెరిగేలానూ చేస్తాయని చెబుతున్నారు. 2018లో Nutrition Research Reviewsలో ప్రచురితమైన "Excess protein intake and weight gain: A systematic review" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
శరీరం మాట వినండి
బరువు తగ్గించుకునే విషయంలో మనసు ఏం చెప్పినా సరే.. శరీరం మాట వినడానికి ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. రుచి, తృప్తి, ఆకలి అనేవాటికే మనం ఎక్కువగా మొగ్గు చూపుతుంటాం. కానీ, శరీర అవసరాలను, అది ఇచ్చే సిగ్నల్స్‌ని కూడా అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. లేదంటే జీర్ణకోశ సమస్యలు, అధిక బరువు, ఇతరత్రా అనారోగ్యాలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'లేట్‌గా పెళ్లి చేసుకోవడమూ క్యాన్సర్‌కు కారణమే'- ఆహారంలో ఈ మార్పులు చేస్తే ఈ వ్యాధిని అడ్డుకోవచ్చట!
'రాత్రి ఎక్కువగా చెమటలు పట్టడం క్యాన్సర్ లక్షణమే'- ఇవన్నీ మీలో ఉన్నాయేమో ఓసారి చెక్ చేసుకోండి!