Hula Hoop Health Benefits : మనం హెల్దీగా ఉండటానికి రోజూ సమతుల ఆహారం తీసుకుంటూనే.. వ్యాయామం కూడా చేయాలని నిపుణులు చెబుతుంటారు. అయితే.. మనలో చాలా మంది పౌష్టికాహారం తీసుకుంటారు కానీ, ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి ఆసక్తి చూపించరు. జిమ్‌లోకి వెళ్లి కసరత్తులు చేయాలని చెప్పినా, ఉదయాన్నే లేచి గ్రౌండ్లో జాగింగ్ చేయాలని సూచించినా.. "అమ్మో నా వల్ల కాదు" అంటుంటారు. అయితే.. ఇలాంటి వారు ఆడుతూ పాడుతూ శరీరంలో ఉన్న కొవ్వును కరిగించుకోవడానిక ఒక ఈజీగా ఎక్సర్‌సైజ్ ఉందంటున్నారు నిపుణులు. అదే 'హూలాహూప్ వ్యాయామం'. రోజూ ఈ హూలాహూప్ ఎక్సర్‌సైజ్‌ను కొద్ది సేపు చేశారంటే.. ఈజీగా ఫ్యాట్ కరిగించుకోవచ్చని నిపుణులంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది :
క్రమం తప్పకుండా హూలాహూప్ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులంటున్నారు. దీనివల్ల గుండెజబ్బులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ పెరుగుదల వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.
క్యాలరీలు కరుగుతాయి :
రోజూ హూలాహూప్ వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. దీనివల్ల ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండవచ్చు. మాయో క్లినిక్ నివేదిక ప్రకారం సాధారణంగా 30 నిమిషాల పాటు హూలాహూప్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మహిళల్లో దాదాపు 165 క్యాలరీలు ఖర్చు అవుతాయట. అలాగే పురుషులలో 200 క్యాలరీలు బర్న్ అవుతాయని పరిశోధకులు గుర్తించారు.
ఒత్తిడి తగ్గుతుంది :
ఈ హూలాహూప్ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మనం సంతోషంగా, ఆనందంగా ఉండటంలో ఎంతో సహాయపడతాయని నిపుణులంటున్నారు.
బరువు తగ్గుతారు :
బరువు తగ్గాలని అనుకుని బద్ధకంగా జిమ్‌కు వెళ్లకుండా, వ్యాయాలు చేయకుండా ఉండే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. రోజూ హూలాహూప్స్ వ్యాయామం చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే బరువును తగ్గించుకోవచ్చని నిపుణులంటున్నారు.