Periods Pain Relief Tips:పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటివన్నీ సహజంగానే ఉంటాయి. అయితే ఇలాంటి శారీరక నొప్పుల నుంచి ఉపశమనం పొందడానిక్ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు చాలా మంది. కానీ, ఇలాంటివి వాడకుండా మన వంటింట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలను రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పరగడుపున ఇవి
నెలసరి నొప్పుల్ని దూరం చేయడంలో కుంకుమ పువ్వు, నల్ల ఎండు ద్రాక్ష సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రెండు వేర్వేరు గిన్నెలు తీసుకొని ఒక దాంట్లో నాలుగైదు ఎండుద్రాక్షలు, మరొక దాంట్లో రెండు కుంకుమపువ్వు రెబ్బలు వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలని అంటున్నారు. అనంతరం మరుసటి రోజు ఉదయం పరగడుపున గ్లాసు నీళ్లు తాగి.. ఆ తర్వాత నానబెట్టిన ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు తినాలని వివరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నెలసరి సమయంలో ఎదురయ్యే శారీరక నొప్పులే కాకుండా.. మూడ్ స్వింగ్స్‌నీ దూరం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఎండు ద్రాక్షలోని ఐరన్, ఫైబర్, ఖనిజాలు ఇందుకు సాయం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే రక్తహీనత, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా దూరంగా ఉండచ్చని తెలిపారు.
దుంపలతో
నెలసరి నొప్పుల్ని, ఆ సమయంలో ఎదురయ్యే అసౌకర్యాన్ని దూరం చేసుకోవాలంటే వారానికి 3-4 రోజులు కొన్ని దుంప కూరలను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దుంప జాతికి చెందిన చేమ దుంప, చిలగడదుంప, బంగాళాదుంప వంటి కాయగూరలు ఈ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయని వివరిస్తున్నారు. వీటిలో ఫైబర్, పాలీఫినాల్స్ వంటివి అధికంగా ఉంటాయని తెలిపారు. అలాగే నెలసరి సమయంలో చాలా మందిలో తలెత్తే మొటిమలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా ఇది చెక్ పెడుతుందని అంటున్నారు. అందుకే చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే దుంపలు కచ్చితంగా తీసుకోమని నిపుణులు పేర్కొన్నారు.