తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్ : గోళ్లు కొరకడం అలవాటు కాదు మానసిక సమస్య - ఈ టిప్స్​తో వెంటనే మానుకోండి! - tips To Stop Biting Nails

How To Stop Biting Nails : మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఎంత ట్రై చేసినా మానలేకపోతున్నారా? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! గోళ్లు కొరకడం ఎంత డేంజరో తెలుసుకుంటే.. మానుకోవడానికి మేం చెప్పే టిప్స్‌ తెలుసుకుంటే.. వెంటనే ఆ అలవాటును దూరం చేసుకుంటారు!

Biting Nails
How To Stop Biting Nails (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 4:16 PM IST

How To Stop Biting Nails :కొంత మంది ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదో ఒకటి ఆలోచిస్తూ.. తమకు తెలియకుండానే గోళ్లు కొరుకుతుంటారు. మరికొందరు ఒత్తిడి, ఆందోళనగా అనిపించినప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. చాలా మందికి ఈ అలవాటు చిన్నప్పుడే మొదలైపోతుందని నిపుణులంటున్నారు. అయితే, ఎప్పుడో ఒకసారి గోళ్లను కొరికితే ఏమో గానీ.. అదే పనిగా గోళ్లను కొరకడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి.. గోళ్లు కొరకడం వల్ల వచ్చే సమస్యలు ఏంటీ? ఈ అలవాటు ఎలా మానుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఇదొక మానసిక సమస్య : గోళ్లు కొరకడం ఒక సాధారణ అలవాటు కాదని.. ఇది ఒక విధమైన మానసిక సమస్యేనని నిపుణులు చెబుతున్నారు. దీన్ని వైద్య పరిభాషలో 'ఒనికోఫాగియా' అని అంటారు. మెజార్టీ జనాలు స్ట్రెస్‌ ఎక్కువగా ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను చూసి ఈ అలవాటును నేర్చుకుంటారట.

గోళ్లు కొరకడం వల్ల వచ్చే సమస్యలేంటి? :

  • అదే పనిగా గోళ్లు కొరకడం వల్ల గోళ్లు పొట్టిగా అవుతాయి. కొందరైతే గోళ్లను మొదళ్ల వరకు కొరకుతారు. దీంతో గోరు కింద స్కిన్‌ ఎర్రగా మారి నొప్పి, వాపు మొదలవుతుంది.
  • గోళ్లు కొరకడం వల్ల అవి పెళుసుగా మారి, వంకర టింకరగా పెరుగుతాయి.
  • మన నోట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్‌లుంటాయి. గోళ్లను కొరకడం వల్ల ఇవి లాలాజలం ద్వారా వేలి కొసలకు, గోరు అడుగు భాగానికి చేరుకుంటాయి.
  • దీనివల్ల చేతులకు, నోటికి ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్​కు చెందిన డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్ (జనరల్‌ ఫిజీషియన్‌) చెబుతున్నారు.
  • ఇంకా వైరల్‌ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాల్‌ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందట.
  • కొన్నిసార్లు గోళ్లు కొరకడం వల్ల దంతాల చిగుళ్లకు ఇన్ఫెక్షన్‌ సోకి.. చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది.
  • అదేపనిగా గోళ్లను కొరకడం వల్ల దంతాలపైన ఉన్న ఎనామిల్‌ దెబ్బతింటుంది.
  • ఒకే దంతంతో గోళ్లను కొరకడం వల్ల దానిపై భారం పడుతుంది.
  • అలాగే ఎక్కువగా గోళ్లు కొరికే వారిలో దంతాలు కూడా అరుగుతాయట.
  • ఈ అలవాటు వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

గోళ్లు కొరికే అలవాటును ఇలా మానుకోండి :

  • ఈ అలవాటు ఉన్నవారు కొన్ని రోజుల పాటు కఠినంగా కొన్ని పనులు చేయాలి.
  • పెరిగిన గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. గోళ్లు పొట్టిగా ఉంటే కొరకటానికి అనువుగా ఉండవు. దీంతో గోళ్లు కొరకాలనే కోరిక క్రమంగా తగ్గుతుంది.
  • అలాగే గోళ్లకు చేదు రుచితో ఉండే నెయిల్‌ పాలిష్‌ను అప్లై చేసుకోవాలి. దీంతో గోళ్లు కొరికినప్పుడు చేదుగా అనిపిస్తుంది.
  • గోళ్లకు బ్యాండేజ్‌ వేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు గ్లౌజులు వేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.
  • గోళ్లను కొరకాలని అనిపిస్తే మెత్తటి బంతిని నొక్కటం, రూబిక్స్‌ క్యూబ్‌ ఆడటం వంటివి చేయాలి.
  • ఈ అలవాటు ఉన్నవారు చూయింగ్‌ గమ్‌ నమలడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details