How To Reduce Hip Fat : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వంటి వివిధ రకాల కారణాలతో చాలా మంది హిప్ (తుంటి ) ఫ్యాట్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, దీన్ని తగ్గించుకోవడానికి కొంత మంది రకరకాల వ్యాయామాలు, ఆహార పద్ధతులు పాటిస్తారు. అయినప్పటికీ ఎలాంటి ప్రభావం కనిపించదు. దీంతో తీవ్ర నిరాశ చెందుతారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే రోజువారీ దినచర్యలో కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. దీని వల్ల ఆ భాగంలో కొవ్వునుఈజీగా కరిగించుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
తుంటి భాగంలో కొవ్వును కరిగించుకోవడానికి ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు, కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లను చేయడం చాలా ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు. లేకపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కార్డియోవాస్కులర్ వ్యాయామాలు..:హిప్ భాగంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు వారి డైలీ లైఫ్‌లో రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, బ్రిస్క్ వాకింగ్ వంటి వాటిని భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే వారంలో కచ్చితంగా 150 నిమిషాల శారీరక శ్రమను కలిగి ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ఈ కార్డియోవాస్కులర్ వ్యాయామాల వల్ల తుంటి భాగంలో కొవ్వు వేగంగా కరిగే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం..:తుంటి భాగంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు రోజువారీ ఆహారంలో పోషకాలు, విటమిన్లు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి. అలాగే తృణధాన్యాలను తినాలని సూచిస్తున్నారు. తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఆహారంలో అవకాడో, డ్రైఫ్రూట్స్, ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవాలని చెబుతున్నారు.
నీరు ఎక్కువగా తాగండి..:ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వ్యక్తులను బట్టి, వారు చేసే శారీరక శ్రమ, బరువు ఆధారంగా మారుతూ ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆకలిగా అనిపించదు. దీనివల్ల ఎక్కువగా క్యాలరీలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా వాటర్ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుందని నిపుణులంటున్నారు. తుంటి భాగంలో కొవ్వు ఉన్నవారు తగినంత నీటిని తీసుకోవాలి.