Precautions for Prevent Cardiac Arrest : ఒకప్పుడు 50 సంవత్సరాలు దాటితే కనిపించే గుండె జబ్బులు ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. గుండెపోటుతో చిన్న వయసులోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు.. జీవనశైలి అలవాట్లే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యంగ్ ఏజ్‌లో గుండె(Heart) సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లను తప్పక అలవర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రక్తపోటు నియంత్రణ :చిన్న వయసులో గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని రక్తపోటును అదుపులో ఉంచుకోవడం. ఇది సైలెంట్ కిల్లర్‌లా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి అప్పుడప్పుడూ బ్లడ్ ప్రెజర్ చెక్ చేసుకుంటుండాలి. ఒకవేళ మీకు ఇప్పటికే బీపీ ఉంటే మీ వైద్యుని సలహాకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం.
కొలెస్ట్రాల్ కంట్రోల్ : ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు చేయాల్సిన మరో పని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉండేలా చూసుకోవడం. ముఖ్యంగా గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్(LDL) పెరగకుండా చూసుకోవాలి. ఇందుకోసం.. క్రమం తప్పకుండా వ్యాయామంతోపాటు గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలి. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. LDL కొలెస్ట్రాల్ స్థాయిలను 10% తగ్గించడం వల్ల గుండెపోటు ప్రమాదం 20% తగ్గుతుందని కనుగొన్నారు.
మధుమేహం నియంత్రణ : డయాబెటిస్ కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దీని బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే అధిక చక్కెరస్థాయి మీ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. క్రమంగా అది ధమనులలో కొవ్వు పేరుకుపోవడానికి దారి తీస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
వేకువజామునే గుండెపోటు ముప్పు- సోమవారాల్లో మరింత అధికం- కారణం ఏంటి?
వ్యాయామం :మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పని రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం. ఇది మీ హృదయాన్ని బలంగా చేయడమే కాకుండా బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందుకోసం మీ దినచర్యలో ఏరోబిక్ కార్యకలాపాలు, నడక, వాకింగ్ వంటివి చేర్చుకోండి. ది లాన్సెట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ 30 నిమిషాల నడక వ్యాయామం గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని 7-8% తగ్గిస్తుందని కనుగొన్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం :మనం ఆరోగ్యంగా ఉండడంలో డైలీ తీసుకునే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. కానీ, ఈరోజుల్లో యువత ఎక్కువగా డీప్ ఫ్రై, ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్‌ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో బరువు పెరగడమే కాకుండా కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయి. అంతిమంగా హార్ట్ ప్రాబ్లమ్స్‌ను కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు చిన్న వయసులో గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.
బరువు నియంత్రణ : అధిక బరువు, గుండె జబ్బులు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఎందుకంటే అధిక బరువు మీ హార్ట్‌పై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అది మీ గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బరువు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం : దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం డైలీ ధ్యానం, యోగా, డీప్ బ్రీతింగ్ వంటి స్ట్రెస్‌ను తగ్గించే వాటిని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా డైలీ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇవేకాకుండా మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహల్, డ్రగ్స్, ధూమపానం వంటి వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమంటున్నారు. ఇలా ఈ అలవాట్లను మీ డైలీ లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకున్నారంటే.. గుండెపోటు రాకుండా చూసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అలర్ట్ : మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - గుండెపోటుకు దారితీయొచ్చు!