How To Identify Fake Cashews :జీడిపప్పు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనకు తెలిసిందే. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్‌ను చూసి కొంత మంది వ్యాపారులు నకిలీ జీడిపప్పును విక్రయిస్తున్నారు. కాబట్టి, మనం జీడిపప్పు కొనేటప్పుడు మంచి నాణ్యమైనది కొనుగోలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫేక్ జీడిపప్పును ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్లగా ఉంటేనే..
అసలైన జీడిపప్పు తెల్లగా ఉంటుంది. మనం మార్కెట్లో జీడిప్పును కొనేటప్పుడు అది కాస్త పసుపు రంగులో ఉంటే అది నకిలీదని గుర్తించాలి. అలాగే జీడిపప్పుపై మచ్చలు, నలుపుగా, రంధ్రాలు ఉంటే కూడా వాటిని కొనకూడదు. అవి నకిలీవి. ఇలాంటి జీడిపప్పును కొనుగోలు చేయడం వల్ల మన మనీ లాస్ తప్ప, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలనూ పొందలేమని నిపుణులు చెబుతున్నారు.
త్వరగా పాడవదు..
అసలైన జీడిపప్పు తొందరగా పాడవకుండా ఉంటుంది. అలాగే నకిలీ జీడిపప్పు త్వరగా పాడైపోతుంది. ఇందులో కీటకాలు, పురుగుల వంటివి ఏర్పడవచ్చు. నాణ్యమైన జీడిపప్పు కనీసం ఆరు నెలల వరకైనా చెడిపోకుండా ఉంటుందట. కాబట్టి చెక్ చేసుకొని మరీ.. మంచి జీడిపప్పును కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
మందంగా ఉంటుంది..
మంచి నాణ్యమైన జీడిపప్పు ఒక అంగుళం పొడవు, కొంచెం మందంగా ఉంటుంది. చిన్నగా, మందం తక్కువగా ఉంటే అవి నకిలీవని గుర్తుపట్టాలి. ఇలాంటి వాటిని కొనుగోలు చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.