How to Cure Dandruff in Winter at Home:ప్రస్తుతం చుండ్రు సమస్య అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ చుండ్రు పొట్టులాత రాలుతుందని ఆవేదన చెందుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా చుండ్రు సమస్య వేధిస్తుంది. దీని కారణంగా జుట్టు రాలిపోవడమే కాకుండా తలలో దురద, ముఖంపై చిన్న చిన్న మొటిమలు కూడా వస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చలికాలంలో ఎక్కువగా వేధించే చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
"మనలో చాలా మంది సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల డాండ్రఫ్ వస్తుందని అనుకుంటారు. కానీ అదంతా అపోహ. పొడి తల వారిలో కూడా ఎక్కువగా కడగడం వల్ల కూడా వస్తుంది. ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి, వయసు కూడా చుండ్రు సమస్యకు కారణం అవుతుంది. అలాగే హర్మోన్లు కూడా డాండ్రఫ్ సమస్యలో కీలక పాత్ర పోషిస్తుంది. మహిళలతో పోల్చుకుంటే పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది."
---డాక్టర్ శైలజ సూరపనేని, డెర్మటాలజిస్ట్
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- ముఖ్యంగా కొందరు మార్కెట్లోకి ఏ కొత్త షాంపూ వచ్చినా ప్రయత్నిస్తుంటారు. అయితే, ఇలా వాడడం వల్ల కూడా డాండ్రఫ్ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
- ఇంకా గాఢత ఎక్కువగా ఉన్న షాంఫూలను వాడుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. చుండ్రు సమస్య మరి ఎక్కువగా మారితే, వైద్యులు సూచించిన షాంపూలను వాడుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.
- అలాగే ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల కూడా చుండ్రు సమస్య పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి నిత్యం ధ్యానం, యోగా లాంటివి చేయాలని సూచిస్తున్నారు.
- చలికాలంలో రోజూ తలస్నానం చేయడం మంచిది కాదని నిపుణులు ఇలా చేయడం వల్ల కుదుళ్ల నుంచి ఉత్పత్తయ్యే నూనెలు మొత్తం తొలగిపోయి చుండ్రు సమస్య తలెత్తుతుందని వివరిస్తున్నారు.
- ముఖ్యంగా విటమిన్ 'బి', జింక్ వంటివి అధికంగా లభించే వాల్‌నట్స్, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇవి కుదుళ్లు పొడిబారకుండా చేసి చుండ్రు రాకుండా అడ్డుకుంటాయని వివరిస్తున్నారు.
- చలికాలంలో వీలైనంత వరకు హెయిర్ స్త్టెలింగ్ ఉత్పత్తులను ఉపయోగించకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా కుదుళ్లు సులభంగా పొడిబారిపోతాయని అంటున్నారు. ఫలితంగా ఈ సీజన్లో ఇలాంటి వాటిని ఉపయోగిస్తే.. వాటిలోని రసాయనాల ప్రభావం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చలికాలంలో షుగర్ పెరుగుతుందా? ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే అదుపులో ఉంటుందట!
హార్ట్ ఎటాక్ తెల్లవారుజామునే ఎందుకు వస్తుందో తెలుసా? గుండెపోటు వస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలట!