Tips to Avoid Ants in Home:ఇంట్లో చీమలతో పెద్ద సమస్యగానే ఉంటుంది. ఏ పదార్థాన్ని పెట్టినా నిమిషాల్లో అక్కడకు చేరిపోతాయి. పాలు, పెరుగు, పంచదార, స్వీట్లు, అన్నం ఇలా ఒక్కటేమిటి ఏవి కనిపించినా సరే క్షణాల వ్యవధిలోనే వరుసలు కట్టేస్తుంటాయి. ఇక చీమల బెడదను తట్టుకోలేక చాలా మంది స్ప్రేలు ఉపయోగించి వీటిని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే స్ప్రేలలోని కెమికల్స్ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో నేచురల్‌గా చీమలను తరిమి కొట్టొచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వేప నూనె:చీమలను ఇంటి నుంచి తరిమి కొట్టడానికి వేప నూనె ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. వేప గింజల నుంచి తీసే ఈ నూనె సహజమైన పురుగుల నివారిణిగా కూడా సాయపడుతుందని చెబుతున్నారు. దీన్ని ఇంట్లోనే కాకుండా, మొక్కలపై కూడా స్ప్రే చేయడానికి వాడవచ్చంటున్నారు. అందుకు 1(నూనె):10(వాటర్) నిష్పత్తిలో నూనె, వాటర్ కలుపుకుని చీమలు తిరిగే దగ్గర స్ప్రే చేయాలి. ఆ వాసనకు చీమలు తగ్గుతాయని అంటున్నారు.
2005లో Journal of Economic Entomologyలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం వేప నూనె స్ప్రే చీమల సంఖ్యను 50% వరకు తగ్గించడంలో సమర్థవంతంగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హవాయి విశ్వవిద్యాలయంలో ఎంటోమాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ T. C. వాంగ్ పాల్గొన్నారు.
పెప్పర్ మింట్:పెప్పర్ మింట్ నీటిని చల్లడం వల్ల చీమలు రావని నిపుణులు అంటున్నారు. అలాగే, ఇంట్లో పుదీనా మొక్కను పెంచుకోవడం వల్ల చీమలు, దోమలు, పురుగుల్లాంటివి రావడం తగ్గుతాయని చెబుతున్నారు.
మిరియాల పొడి, కారం:నల్ల మిరియాల పొడి, ఎర్ర కారం ఇవి రెండింటిలోనూ ఘాటైన వాసన ఉంటుందని... ఇది చీమల బెడదను తగ్గించడానికి సహాయపడతాయని అంటున్నారు. ఈ పొడులను వంటగది మూలల్లో చల్లడం వల్ల బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.