Tips to Avoid Aggressive Behavior in Children :పిల్లలు దూకుడు స్వభావాన్ని కలిగి ఉండడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే.. అలా ఎందుకు ఉంటారు? దీనికి కారణం ఏంటి? అన్నది చాలా మంది తల్లిదండ్రులకు అర్థంకాదు. దీంతో.. వారిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. వారు పలు రకాల మానసిక ఇబ్బందుల వల్ల అలా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కారణాలు గుర్తించండి:మీ పిల్లలు దూకుడు స్వభావం కలిగి ఉంటే.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేయొద్దని.. అందుకు గల కారణాలేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ, అలసట, ఆకలి వంటి అంశాలతోపాటు మరికొన్ని పరిస్థితుల వల్ల కూడా కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కారణాలను గుర్తించి, వాటిని తగ్గించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
భావోద్వేగ నియంత్రణ:పిల్లలు తరచుగా తమ భావోద్వేగాలను పూర్తి స్థాయిలో వ్యక్తీకరించడానికి కష్టపడతారని.. ఇలాంటి సమయంలో వారిలో ఒత్తిడి పెరిగి, కోపం లేదా నిరాశకు దారి తీస్తుందని అంటున్నారు. కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల్లో మీ పిల్లలకు మద్దతుగా నిలవాలని, వాళ్ల ఫీలింగ్స్‌ను ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో వివరించాలని, ఇందుకోసం సహాయపడాలని నిపుణులు సూచిస్తున్నారు. వారి భావాలను నిర్భయంగా పంచుకోవడానికి కావాల్సిన వాతావరణం ఉండేలా చూడాలని చెబుతున్నారు.