High Bp and Sleepless Side Effects: అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) ఇప్పుడు అన్ని వయసుల వారికి సర్వసాధారణంగా మారింది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు.. ఇవన్నీ అధిక రక్తపోటుకు కారణాలు. ఇక హైబీపీ వల్ల గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు సహా ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే హైబీపీకి నిద్రలేమి తోడైతే మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఓ పరిశోధన హెచ్చరిస్తోంది. ఈ పరిశోధన సారాంశం ఏంటి? దీనికి వైద్యులు సూచిస్తున్న పరిష్కారాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పరిశోధన వివరాలు: అధిక రక్తపోటు, నిద్రలేమి.. ఈ రెండు సమస్యలూ మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆస్ట్రేలియాలోని మొనాష్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మోనాష్ వర్సిటీ చేసిన అధ్యయనం కోసం 682 మంది నుంచి డేటాను సేకరించారు.
ఇందులో ప్రఖ్యాత ‘ఫ్రామింగామ్ హార్ట్ స్టడీ’లో పాల్గొన్న వ్యక్తులతోపాటు, హైపర్‌టెన్షన్ కలిగి ఉండి, నిద్రలేమితో బాధపడుతున్న వారిపై అధ్యయనం చేశారు. వీరిలో 637 మందికి మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్(MRI) పరీక్ష నిర్వహించి పరిశీలించారు. వీరిలో హైపర్ టెన్షన్ కలిగి ఉండి, నిద్రలేమి సమస్య కూడా ఉన్నవారి ఎంఆర్‌ఐలు పరిశీలిస్తే.. బ్రెయిన్ మార్కర్స్‌లో మెదడు పనితీరు దెబ్బతిన్నట్టు స్పష్టమైందని అంటున్నారు.
మెదడులో వచ్చే మార్పులు.. వయసు పైబడిన వారితో పోలిస్తే.. హైపర్‌టెన్షన్, నిద్రలేమితో బాధపడుతున్న వారిలో చిన్నవయసులోనే కనిపించాయని పరిశోధకులు విశ్లేషించారు. అధిక రక్తపోటు ఉన్నా.. నిద్రలేమి సమస్యలు లేని వారిలో మెదడు పనితీరు బాగానే ఉన్నట్టు కనుగొన్నారు. హైపర్‌టెన్షన్, నిద్రలేమి రెండూ ఉన్నవారి మెదడు పనితీరు ఎలా ఉండేదనే అంశంపై ఇంతకుముందు స్పష్టత లేదని, ఈ పరిశోధనతో దానిపై స్పష్టమైన ఫలితాలు వచ్చాయని మొనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మాథ్యూ పేస్ అభిప్రాయపడ్డారు.