Healthy Diet Plan for Night Shift Workers :ఉదయం చాలా మంది టిఫెన్ లాగిస్తుంటారు. ఇడ్లీ నుంచి దోసె వరకు టేస్టీ టేస్టీ ఐటమ్స్ తినేస్తుంటారు. అయితే.. కొన్ని కారణాలతో కొందరు మాత్రం పొద్దున కూడా అన్నం తింటారు. నైట్ షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు కూడా కాస్త ఆలస్యంగా నిద్రలేచి ఉదయాన్నే భోజనం చేస్తారు. మరి.. బ్రేక్‌ఫాస్ట్(Breakfast) కు బదులుగా అన్నం తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా? అంటే.. దీనికి వైద్యులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అల్పాహారానికి బదులు భోజనం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ రావని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు జానకీ శ్రీనాథ్. ఎందుకంటే.. ఏం తింటున్నాం అనే దానికన్నా.. అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయనేది ముఖ్యమని చెబుతున్నారు. అంతేకాదు.. మీరు తినే సమయం కొంచెం అటుఇటూ అయినా శరీరానికి అందించే పోషకాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని డాక్టర్ జానకీ శ్రీనాథ్ సూచిస్తున్నారు. భోజనంలో తప్పకుండా సరైన పోషకాలు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అంటే.. దంపుడు బియ్యం, ఆకుకూరలు, పప్పు, పెరుగు వంటి పదార్థాలు లంచ్‌లో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? ఈ ఫుడ్స్ తింటే ఫుల్ జాలీగా ఉండొచ్చు!
అదేవిధంగా.. మీరు ఉదయం అల్పాహారంగా తినాల్సిన వాటిని సాయంత్రం స్నాక్స్‌లో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. స్నాక్స్‌లో గుగ్గిళ్లు, ఓట్స్, రాగి జావ, ఆమ్లెట్, జొన్నఇడ్లీ, పెసరట్టు, దోశ వంటివీ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేయాల్సి ఉన్నవారు.. తాజా పండ్లను సలాడ్స్‌గా 6 నుంచి 7 గంటల మధ్యలో తినడం మంచిదని సూచిస్తున్నారు. ఆ తరువాత రాగి, జొన్నపిండితో చేసిన చపాతీలను ఆకుకూరలతో తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా మీరు యాక్టివ్‌గా ఉండేలా కూడా చేస్తాయంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్.