Health benefits of walking :వ్యాయామాల్లో అత్యంత తేలికైనది నడక. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేసే ఎక్సర్సైజ్ వాకింగ్. అందుకే ఉన్న వ్యాయామాలన్నింటిలో దీనిని అతిముఖ్యమైనదిగా భావిస్తుంటారు. ప్రతి రోజూ కొంతసేపు నడవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమే కాకుండా, మనసూ ప్రశాంతంగా ఉంటుంది. మధుమేహం, మానసిక ఆందోళన, రక్తపోటు, కీళ్ల నొప్పులు లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు రోజూ కాసేపు నడవటం వల్ల చెక్ పెట్టవచ్చు. అందుకే నడకను అలవాటు చేసుకోవాలని డాక్టర్లందరూ చెబుతుంటారు. అయితే వాకింగ్ చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?, రోజూ ఎంత సమయం నడిస్తే మంచింది? అనే విషయాలతో పాటు నడక వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలేంటి? అనే విషయాలపై వైద్య నిపుణుల సూచనలు మీకోసం.
నడక వల్ల కలిగే ప్రయోజనాలు
- నడిచే సమయంలో మనం గాలిని అధికంగా తీసుకుంటాం. దాని ద్వారా శరీరంలో అనేక జబ్బులకు కారణమయ్యే కొవ్వు బాగా కరుగుతుంది.
- శరీరంలో ఫీల్ గుడ్ ఎండార్పిన్లు విడుదలవుతాయి. దాని ద్వారా మనసు ఉల్లాసంగా ఉండటమే కాకుండా రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
- ప్రతిరోజు కాసేపు వాకింగ్ చేయడం వల్ల కలిగే ఎముకలు గట్టి పడతాయి. కండర శక్తి పెరుగుతుంది.
- వాకింగ్‌తో గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- శరీరానికి చెమట పట్టేలా నడవటం వల్ల బాడీలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
- క్రమం తప్పకుండా వాకింగ్ చేయటం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
- అంతే కాకుండా సరైన నడకతో, మధుమేహం, పక్షవాతం, బీపీ లాంటి వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చు.
వాకింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు- వైద్యుల సూచనలు
- ఒక గంటలోపు మూడు కిలోమీటర్ల కంటే తక్కువ నడిస్తే దానిని నార్మల్ వాక్ అంటారు. దీనికి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు నేరుగా నడవవచ్చు.
- ఒక వేళ గంటకు 6 కిలోమీటర్లు నడిస్తే దానిని మోడరేట్ వాక్ అంటారు. దీనిని ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా కొంత వ్యాయామం చేయడం అవసరం.
- ఇక జాగింగ్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అదే విధంగా ముగించిన తర్వాత కొన్ని వార్మప్‌లు చేయాలి
- ఏదైనా వ్యాధి వల్ల ఇబ్బంది పడేవారు అతిగా నడవటం అంత మంచిది కాదు.
- శరీరానికి ఎక్కువగా లేదా తక్కువగా కాకుండా అవసరమైన మేర నడవటం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి.
- నడిచేటప్పుడు తప్పనిసరిగా ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి, ఎక్కువగా కాకుండా కొంత నీరు తాగాలి.
- ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం నడవటం శరీరానికి మంచిది.
- 45 సంవత్సరాల పైబడిన వారికి ఏమైనా అనారోగ్య సమస్యలుంటే డాక్టర్‌ను సంప్రదించి వారి సూచనల మేరకు వాకింగ్ చేయాలి.