Health Benefits Of Ragi :తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులను పేదవాడి ఆహారంగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు దీన్ని పేదవాళ్లు కాదు పెద్ద పెద్ద వాళ్లు కూడా ఏరి కోరీ తెచ్చుకుని క్రమం తప్పకుండా తింటున్నారు. ఇందుకు కారణం రాగులు తినడం వల్ల కలిగే లాభాలనే చెప్పవచ్చు. ఐరన్, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట. దీంట్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల అసంతృప్త కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
రాగుల పిండితో జావ చేసుకోవడం, దోసలు వేసుకోవడం వల్ల చాలా రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను తయారు చేసుకొని తినవచ్చు. ముఖ్యంగా బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి రాగులు చక్కటి ఆహార పదార్థమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాగులను మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకుని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గడం
రాగుల్లో అధికంగా లభించే ఫైబర్ మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మిమ్మల్ని అతిగా తినకుండా ఆపుతుంది. చాలాసేపటి వరకు మీ కడపును నిండుగా ఉంచుతుంది. ఫిట్నెస్ ప్రియులు, ఉబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
గుండె పదిలం
రాగి పిండిలో పుష్కలంగా లభించే మెగ్నీషియం, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. రాగుల్లో ఉండే ఇతర ముఖ్యమైన పోషకాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుని శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాలు తగ్గుతాయి.
డయాబెటిస్ నివారిణి
రాగులను తరచుగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.