Somavaram Masa Sivaratri Puja Vidhi In Telugu : అత్యంత అరుదుగా వచ్చే సోమవారం మాస శివరాత్రి! ఈ రోజు శివయ్యను ఎలా పూజించాలి? అసలు మాస శివరాత్రి అంటే ఏమిటి? శివుని పూజకు మాస శివరాత్రి ఎందుకంత ప్రత్యేకం? ఈ వివరాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.
మాస శివరాత్రి అంటే ఏమిటి?
ప్రతినెలా ఒక మాస శివరాత్రి వస్తుంది. అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథి పరమేశ్వరుని జన్మ తిధి. అందుకే ప్రతి నెలా పరమేశ్వర ప్రీత్యర్ధం మాస శివరాత్రిని విశేషంగా జరుపుకుంటాం. అయితే మాస శివరాత్రి జరుపుకోవాలంటే చతుర్దశి తిథి సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఉండాలి.
మాస శివరాత్రి ఎప్పుడు?
జనవరి 27 వ తేదీ సోమవారం మాస శివరాత్రి కలిసి రావడం గొప్ప విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ రోజు రాత్రి 7:30 నిమిషాల నుంచి 9 గంటల వరకు శివపూజకు శుభ సమయం.
మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి?
పరమశివుడు లయ కారకుడు. అంటే సృష్టిని అంతం చేసే వాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు చంద్రుడు క్షీణంగా ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనః కారకుడు. అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలంటే జాతకంలో చంద్రబలం బాగుండాలి. అమావాస్య ముందు చతుర్దశి రోజున చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతు ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది. నవగ్రహాలలో కేతువు లయం అంటే మృత్యు కారకుడు కాబట్టి చంద్రుడు బలహీనంగా ఉన్న సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యాలపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అమావాస్యకు ముందు ఆరోగ్య సమస్యలకు ఇదే కారణం
కొంతమందికి అమావాస్య ముందు ఆరోగ్యం బాగోలేకపోవడం, కొన్ని రకాల మానసిక సమస్యలు ఎక్కువ కావడం, అనుకోని ప్రమాదాలు జరిగి మృత్యు వాత పడటం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కేతు ప్రభావాలే! అంతేకాదు చంద్ర బలం తక్కువగా ఉన్న సమయంలో కేతు ప్రభావం పెరిగి జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
కేతు గండాలను పోగొట్టే మాస శివరాత్రి పూజ
కేతు గండాల నుంచి బయట పడటానికి శాస్త్రం మాస శివరాత్రి పూజకు ప్రాధాన్యతను ఇచ్చింది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా! అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని ఆరాధించి సంపూర్ణ ఆయుష్షును పొందిన కథ మనందరికీ తెలిసిందే! అందుకే మాస శివరాత్రి రోజు శివుని నియమ నిష్టలతో ఆరాధిస్తే ఎలాంటి గండాలైనా పోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది.
మాస శివరాత్రి పూజా విధానం
మాస శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేచి శుచియై ఇంట్లో పూజాదికాలు ముగించుకొని శివాలయానికి వెళ్లి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ రోజంతా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉపవాసం చేయాలి. సాయంత్రం ప్రదోష వేళలో తిరిగి స్నానం చేసి శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో, గంగా జలంతో అభిషేకం జరిపించి, అష్టోత్తర శత నామాలతో శివయ్యని అర్చించాలి. శివయ్యకు పండ్లు, కొబ్బరికాయలు, పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు.
మాస శివరాత్రి పూజాఫలం
మాస శివరాత్రిని ఈ విధంగా శాస్త్రోక్తంగా జరుపుకోవడం వలన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. జాతకంలోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. వృత్తికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. రానున్న మాస శివరాత్రి రోజు మనం కూడా భక్తిశ్రద్ధలతో శివయ్యని పూజిద్దాం ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. ఓం నమః శివాయ
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.