Finger Millet Health Benefits :మన శరీరం శక్తిమంతంగా ఉండి పనులను సవ్యంగా చేసుకోవాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కానీ, మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలా మందికీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పలు, నడుము నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాల్షియం లోపం కారణంగా ఎముకల సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఎముక పుష్టికి కావాల్సిన పోషకాలు అనగానే పాలు, పాలసంబంధిత పదార్థాలనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటుంటారు.
ఎందుకంటే వాటిలో బోన్స్ బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడే కాల్షియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయని భావిస్తారు. కానీ, కొందరికి పాలలో ఉండే లాక్టోజ్ కారణంగా జీర్ణసమస్యలు తలెత్తుతుంటాయి. అలాగే, లోకార్బ్, కీటోజెనిక్ డైట్లు చేసేవాళ్ల పరిస్థితేంటి? కాబట్టి, అలాంటి వారంతా ఎముకలు బలంగా మారడానికి రాగులుతీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఎముకల బలోపేతానికి అవసరమైన పోషకాల్లో అత్యంత ముఖ్యమైనది కాల్షియం. ఇది పాలల్లో కంటే రాగుల్లో ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. 250 మిల్లీ లీటర్ల పాలలో 300 గ్రాముల కాల్షియం ఉంటే, అదే 100 గ్రాముల రాగుల్లో 344 గ్రాముల కాల్షియం ఉంటుందని సూచిస్తున్నారు. అయితే, కాల్షియాన్ని పాల రూపంలో తీసుకుంటే అరుగుదలకు అందులో ఉండే న్యూట్రియంట్లు సరిపోతాయి. కానీ, రాగుల్లో ఆ సౌలభ్యం లేదు. కాబట్టి వీటిని నానబెట్టడం, పులియబెట్టడం లాంటి ప్రక్రియల ద్వారా తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు. అందుకే, పాలలో ఉండే లాక్టోజ్ జీర్ణంకాని వాళ్లూ, లోకార్బ్, కీటోజెనిక్ డైట్లు చేసేవాళ్లు డైలీ డైట్లో రాగులను చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
2018లో "Food Science and Technology" అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం రాగులతో చేసిన ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి, బలంగా మారడానికి చాలా బాగా తోడ్పడతాయని కనుగొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఎస్. వెంకటేష్ బాబు ఈ రీసెర్చ్‌లో పాల్గొన్నారు.