Health Benefits Of Fasting :మనలో చాలా మంది దేవుడిపై భక్తితో వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటుంటారు. అలాగే మరికొందరు బరువు తగ్గడానికి ఫాస్టింగ్ చేస్తుంటారు. కేవలం నీళ్లు, జ్యూస్లను తాగుతూ ఉపవాసం చేస్తుంటారు. అయితే, ఇలా కొన్ని గంటల పాటు ఆహారం తినకుండా ఉంటే మీ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా?
గుండె ఆరోగ్యంగా :ఉపవాసం ఉండడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గిపోతాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటూ అప్పుడప్పుడూ ఉపవాసం ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
షుగర్ స్థాయులు అదుపులో :ఫాస్టింగ్ ఉండడం వల్ల మన బాడీలో ఇన్సూలిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది :మన శరీరంలోఉపవాసం ఉన్నప్పుడు కొవ్వు శక్తిగా మారడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను 'కీటోసిస్' అంటారు. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉపవాసం తర్వాత భోజనం చేసినప్పుడు, శరీరంలో శక్తి స్థాయులు పెరుగుతాయి. ఇది మనల్ని మరింత చురుకుగా, అలర్ట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.
గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది :ఉపవాసం ఉండడం వల్ల కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయులు కొంతవరకు పెరుగుతాయి. అయితే, కార్టిసాల్ కూడా గ్రోత్ హార్మోన్ విడుదలను కొంత ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్రోత్ హార్మోన్ శరీర పెరుగుదలను, కణాల పునరుత్పత్తిని, కొవ్వును కండరాలుగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఉపవాసం చేయడం కొంత వరకు మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గుతారు :ఉపవాసం చేసేటప్పుడు మనం తినే ఆహారం తగ్గుతుంది. కాబట్టి, శరీరానికి అందే క్యాలరీలూ తగ్గుతాయి. మన శరీరానికి అవసరమైన క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలు తీసుకున్నప్పుడు, శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు శక్తి కోసం ఖర్చవుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. అలాగే కొన్ని రకాల ఉపవాసాలు మన బాడీలో మెటాబాలిజం రేటును పెంచుతాయి. అంటే.. శరీరం క్యాలరీలను ఎక్కువగా వినియోగించుకోవడం ప్రారంభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.