Health Benefits of Crying : "కన్నీళ్లు".. తట్టుకోలేని బాధకు చిహ్నం. భరించలేని కష్టం కలిగినప్పుడు.. మనసు తీవ్ర భావోద్వేగానికి గురైనప్పుడు బరస్ట్ అవుతారు. భోరున ఏడ్చేస్తారు. మరికొందరు మానసిక వేదనతో కుమిలిపోతుంటారు. తీవ్రంగా బాధపడుతున్నా.. కంట్లోంచి చుక్కనీరు రాదు. మరి.. ఏడిస్తే మంచిదా? వేదన మనసులోనే దాచుకుంటే మంచిదా అంటే.. ఏడ్చేయాలంటున్నారు నిపుణులు.
రిఫ్లెక్స్ టియర్స్ :కన్నీటిలో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. అందులో రిఫ్లెక్స్ టియర్స్ ఒకటి. ఇవి సాధారణంగా మనం ఉల్లిపాయలు కోసినప్పుడు, పొరపాటున కళ్లలో ఏదైనా దుమ్ము పడినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు వస్తాయి. ఇవి కళ్లలో పడ్డ దుమ్ము, ధూళి బయటకు వచ్చేందుకు, కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
బాసల్ టియర్స్ :వీటిని శుభ్రం చేసే కన్నీరు అంటారు. నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రోలీటర్ల వరకు ఉత్పత్తి అవుతాయట. ఈ కన్నీళ్లు కళ్లను తేమగా ఉంచడంతోపాటు ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయట. ఇవి కన్నీటి నాళాల పనితీరును నిర్వహించడంలో సహాయపడతాయి.
ఎమోషనల్ టియర్స్ : వీటిని భావోద్వేగ కన్నీళ్లు అంటారు. ఈ కన్నీళ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భావోద్వేగాలకు గురైనప్పుడు కార్టిసాల్, ఇతర టాక్సిన్స్ వంటి ఒత్తిడి హార్మోన్లు కలిగించే రియాక్షన్ కారణంగా ఈ కన్నీళ్లు వస్తాయి. కాబట్టి వీటివల్ల మనసులోని ఒత్తిడి తగ్గుతుందట. కాబట్టి.. ఏడుపు మంచిదే అంటారు నిపుణులు. ఇంకా.. ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే..
మానసిక ఒత్తిడి తగ్గుతుంది :యూఎస్ఏలోని యేలె యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో కన్నీళ్లు మనిషి భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయని తేలింది. ఏడవటం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గి మనసు కుదుట పడుతుందని పేర్కొన్నారు పరిశోధకులు.