Handgrip Strength as a Predictor of Diabetes :ప్రస్తుత ఆధునిక కాలంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే.. ఇక జీవితమంతా మందులు వాడుతూ.. ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలుతీసుకోవాల్సిందే. లేకపోతే శరీరంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగి కిడ్నీ, గుండె జబ్బులు వంటి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా షుగర్ ఉందా.. లేదా ? అని రక్తపరీక్ష ద్వారా వైద్యులు గుర్తిస్తారు. అలాగే వీరిలో తరచూ మూత్రవిసర్జన సమస్య ఇబ్బంది పెడుతుందని నిపుణులు చెబుతుంటారు. ఇంకా గాయాలు మానకపోవడం, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు షుగర్ వ్యాధికి సంకేతాలేనని అంటున్నారు. అయితే, తాజాగా మనం డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్ బారిన పడ్డామా అనేది మన పిడికిలి బిగించే శక్తి తెలియజేస్తుందని పరిశోధకులు కనుగోన్నారు. ఈ అధ్యయనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ముగ్గురిలో ఒకరు!
వయసు పెరిగే కొద్దీ శరీర కణాలు ఇన్సులిన్‌కు ప్రతిస్పందించడం తగ్గుతూ వస్తుంది. దీనివల్ల బ్లడ్‌లో చక్కెర స్థాయులు పెరుగుతాయి. అయితే, 65ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరు మధుమేహం బారిన పడుతున్నారట. అందులోనూ పోస్ట్ మెనోపాజ్ స్టేజ్‌లో ఉన్న మహిళలకు ఈ ప్రమాదం మరింతగా పొంచి ఉందని 'ది మెనోపాజ్ సొసైటీ'లో ప్రచురితమైన పరిశోధనలు చెబుతున్నాయి. ఈ స్టేజ్‌లో ఈస్ట్రోజన్ స్థాయులు క్రమంగా పడిపోయి.. ఇన్సులిన్ నిరోధకత ఏర్పడటం, కండరాలు బలహీనపడటం వంటివి జరిగి, మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. అయితే, మనం డయాబెటిస్ లేదా ప్రి- డయాబెటిస్ బారిన పడ్డామా అనేది మన పిడికిలి బిగించే శక్తి తెలియజేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 45-65 ఏళ్ల వయసున్న నాలుగు వేలమంది పోస్ట్ మెనోపాజ్ దశలోని మహిళలను ఎంచుకుని, వారి హ్యాండ్‌గ్రిప్ శక్తిని పరీక్షించారు. పిడికిలి బిగించే శక్తి తక్కువున్న మహిళల్లో ఎక్కువమంది మధుమేహం ఉన్నవారేనట. ఎక్కువ కండబలం ఉన్నవాళ్లలో దీని బారిన పడే అవకాశం తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడించారు.