Fruits To Avoid At Night :ఆరోగ్యంగా ఉండటానికి రోజూ తాజా పండ్లు, కూరగాయలను డైట్‌లో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వీటి వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే, అన్ని పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. కొన్ని రకాల పండ్లను రాత్రి సమయంలో తినకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని పండ్లను రాత్రి పూటతినడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి వాటితో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి, రాత్రి సమయంలో తినకూడని పండ్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సిట్రస్ పండ్లు :మీకు నైట్ భోజనం చేసిన తర్వాత నిమ్మ, నారింజ లేదా బత్తాయి వంటి పండ్లను తినడం అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే.. ఈ పండ్లలో చాలా ఆమ్లాలుంటాయి. వీటిని రాత్రి తినడం వల్ల గుండెల్లో మంటగా అనిపించి సరిగ్గా నిద్రపట్టకపోవచ్చని నిపుణులంటున్నారు.
పైనాపిల్ :పైనాపిల్‌లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రాత్రి తినడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల కడుపు నొప్పి,కడుపు ఉబ్బరంవంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ : దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండును రాత్రి పడుకునే ముందు తినడం వల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దాని వల్ల రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. కాబట్టి, రాత్రిపూట వాటర్ మెలన్ తినకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.
మామిడి పండ్లు :మామిడి పండ్లలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అయితే, వీటిని రాత్రి సమయంలో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులంటున్నారు.
పరిశోధన వివరాలు :2014లో 'Nutrition and Metabolism' జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, మధుమేహం లేని వారు రాత్రి భోజనంతో పాటు ఒక మామిడి పండు తిన్న 2 గంటల తర్వాత వారి శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లో ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న 'డాక్టర్. శ్రీనివాసన్' పాల్గొన్నారు. నైట్ టైమ్‌లో మామిడి పండ్లను తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
షుగర్ పేషెంట్లు అరటిపండ్లు తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే? - Bananas For Diabetes Patients