Eye Donation Fortnight 2024 :'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అని మన పెద్దలు చెబుతుంటారు. మానవ శరీరంలో కంటికి అంత ప్రాముఖ్యం ఉంది. అలాంటి కీలకమైన కంటి చూపు లేకుండా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి మరణానంతరం కళ్లను దానం చేస్తే వారికి చూపును ఇచ్చినవారవుతారు. ఇవన్నీ తెలిసినా సరే.. కొందరు కంటి దానం కోసం ముందుకు రారు! దానికి కారణం కంటి దానంపై వారికి సరైన అవగాహన లేకపోవడమే!! ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారిని ప్రోత్సహించడానికి ప్రతి ఏడాది ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, రామయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 300కు పైగా కంటి ఆస్పత్రులు, ఐ బ్యాంకుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కంటి దానంపై ఉన్న అపోహలు, వాస్తవాలు, జాగ్రత్తలను వివరించారు. అవేంటో తెలుసుకుందాం.
ఎవరు దానం చేయకూడదు?
- అనుమానాస్పదంగా మరణించిన వారు
- కంటి క్యాన్సర్ లేదా ఇన్ఫెక్షన్ ఉన్నవారు
- హెచ్ఐవీ ఎయిడ్స్ రోగులు
- హెపటైటిస్ బీ
- హెపటైటిస్ సీ
- సైపిల్స్ వ్యాధిగ్రస్థులు చేయరాదు
కళ్లు ఎవరు దానం చేయవచ్చు?
- పైన చెప్పిన వ్యాధుల మినహా అప్పుడే పుట్టిన శిశువు నుంచి వందేళ్ల వ్యక్తి వరకు ఎవరైనా తమ కళ్లను దానం చేయవచ్చ
- కళ్లద్దాలు ధరించే వారు దానం చేయవచ్చు.
- డయాబెటిక్, హైపర్టెన్సివ్, కంటి నరాల వ్యాధి, ఆస్తమా రోగులు కూడా కళ్లను దానం చేయవచ్చు
- కంటి శుక్లాలను ఎలా సేకరిస్తారు?
- ఓ వ్యక్తి మరణించిన 6-8 గంటల్లోపు కళ్లను సేకరిస్తారు.
- ఒకవేళ ఫ్రీజర్లో ఉంచితే 12-24 గంటల్లోపు కళ్లను సేకరిస్తారు.
- వ్యక్తి మరణించిన ఇళ్లు లేదా ఆస్పత్రి ఇలా ప్రదేశంతో సంబంధం లేకుండా కేవలం 15- 20 నిమిషాల్లోనే సేకరిస్తారు.
- ఎలాంటి మతబేధాలు లేకుండా అందరి వద్ద నుంచి తీసుకుంటారు.
- దాత వ్యక్తిగత వివరాలను సైతం గోప్యంగా ఉంచుతారు.
నేత్రదానం గురించి అపోహలు, వాస్తవాలు:
- కొందరు మనిషి బతికుండగానే కళ్లు సేకరిస్తారని అనుకుంటారు ఇదంతా ఒక అపొహా మాత్రమే. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే కంటి శుక్లాలను సేకరిస్తారు.
- కొందరు తమ మతంలో కంటి దానానికి అనుమతి లేదని అంటుంటారు. కానీ అన్ని మతాలు దీనికి మద్దతు ఇస్తున్నాయి.
- కళ్లు సేకరించి ముఖం రూపురేఖలు మారుస్తారని కొందరు భావిస్తారు. కానీ కళ్లు సేకరించినా సరే ముఖంపై ఎలాంటి మార్పులు కనిపించవు
- కళ్లు సేకరించే ప్రక్రియ వల్ల అంత్యక్రియలకు ఆలస్యం అవుతుందని అనుకుంటారు. కానీ కేవలం 15 -20 నిమిషాల్లోనే దీనిని పూర్తి చేస్తారు.