Exercise to Lower Blood Sugar :ప్రస్తుత కాలంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ఒక్కసారి షుగర్ జబ్బు వచ్చిందంటే ఇక జీవితమంతా మందులు వాడుతూ.. ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగి కిడ్నీ, గుండె జబ్బులు వంటి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. మధుమేహ బాధితులు రోజూ కొన్ని రకాల వ్యాయామాలు(national library of medicine రిపోర్ట్) చేయడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉండేలా చూసుకోవచ్చని సూచిస్తున్నారు. షుగర్‌ని కంట్రోల్లో ఉంచే ఆ వ్యాయామాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్విమ్మింగ్ : స్విమ్మింగ్ అనేది ఒక మంచి కార్డియో వ్యాయామం. ఇది క్యాలరీలను బర్న్ చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల కండరాలు ఎక్కువగా పని చేస్తాయి. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు కండరాలు గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకుని ఉపయోగించుకుంటాయి. దీంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే షుగర్ ఉన్నవారు స్విమ్మింగ్ చేయాలని సూచిస్తున్నారు.
సైక్లింగ్ :
సైక్లింగ్ చేసేటప్పుడు మన కండరాలు చాలా ఎక్కువగా పనిచేస్తాయి. ఈ కండరాల కదలికకు శక్తి అవసరమవుతుంది. ఈ శక్తిని పొందడానికి మన శరీరం రక్తంలోని గ్లూకోజ్‌ను ఉపయోగించుకుంటుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయి. డయాబెటిస్తో బాధపడేవారు క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
2018లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు సైక్లింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో బ్రెజిల్‌లోని యూనివర్సిడేడ్ ఫెడరల్ డో రియో గ్రాండే డో సుల్ (UFRGS)కు చెందిన 'డాక్టర్ డానియేలా అంపియర్' పాల్గొన్నారు.
వాకింగ్ :
షుగర్ ఉన్నవారు సమతుల ఆహారం తీసుకుంటూ.. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఉదయం, సాయంత్రం అరగంట పాటు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నడక పైసా ఖర్చు లేకుండా చేసే వ్యాయామం కాబట్టి, డయాబెటిస్ వారు రోజూ వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు.