Everyone Should Be Done These Blood Tests Every Year : ప్రతిఒక్కరూ అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత కంగారుపడకుండా.. అది రాకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా.. మీకేదైనా వ్యాధి వచ్చే అవకాశాలున్నాయేమో ముందుగానే తెలుసుకోవచ్చంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అందరూ ప్రతి సంవత్సరం ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల రక్త పరీక్షలు(Blood Test) తప్పనిసరిగా చేయించుకోవాలంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కంప్లీట్ బ్లడ్ కౌంట్(CBC) పరీక్ష :మన బాడీలో రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ల సంఖ్యను తెలుసుకోవడానికి CBC పరీక్షను సిఫార్సు చేస్తుంటారు వైద్యులు. అలాగే ఈ టెస్ట్ మీ మొత్తం ఆరోగ్యం, రక్తహీనత, అంటువ్యాధులు, రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన రుగ్మతల నిర్ధారణ గురించి అవసరమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు.. ఈ పరీక్ష ప్రత్యేకంగా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎంతమొత్తంలో ఉందనే సమాచారాన్ని అందిస్తుంది.
లిపిడ్ ప్రొఫైల్ : ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాల్సిన మరో బ్లడ్ టెస్ట్.. లిపిడ్ ప్రొఫైల్. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఇతర లిపిడ్ మార్కర్లను అంచనా వేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయా? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఫలితంగా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
గ్లూకోజ్ పరీక్ష :రక్తంలో చక్కెర స్థాయిలను అంచనా వేయడానికి, మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ను గుర్తించడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. అయితే, సాధారణంగా రెండు గ్లూకోజ్ టెస్ట్లు ఉంటాయి. అందులో ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్(FBS). ఇందుకోసం ఖాళీ కడుపుతో బ్లడ్ తీసుకుంటారు. ఈ పరీక్ష ద్వారా శరీరానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేసే కెపాసిటీని తెలుసుకోవచ్చు.
మరో గ్లూకోజ్ పరీక్ష.. హిమోగ్లోబిన్ A1C. దీని ద్వారా రెండు నుంచి మూడు నెలల్లో మీ సగటు రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీలో మధుమేహం లేదా ప్రీ డయాబెటిస్ ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. దాంతో సరైన చికిత్స తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, నరాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.