Epilepsy Symptoms :ఫిట్స్ ఒకసారి వచ్చిందంటే పోదు. దీర్ఘకాలిక రుగ్మతగా ఉండిపోతుంది. చాలావరకూ ఈ మూర్ఛ చిన్న వయసులోనే మొదలవుతుంటుంది. అలాగని.. పెద్దయ్యాక రాదని చెప్పలేం. ఇది జీవితంలో ఎప్పుడైనా తలెత్తొచ్చంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి.. ఇది వారసత్వంగా ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు వైద్యులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మూర్ఛ అనేది బ్రెయిన్‌కు సంబంధించిన ఒక వ్యాధి. దీన్నే ఫిట్స్, ఎపిలెప్సీ అని కూడా అంటారు. మెదడు పనితీరుకు సంబంధించి ఏదైనా ఆటంకం ఏర్పడినప్పుడు ఈ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే.. దీని లక్షణాలు మెదడులో ప్రభావితమైన భాగంపై ఆధారపడి ఉంటాయి. ఇది తలెత్తినప్పుడు.. అవయవాలు వణకడం, ఆకస్మికంగా పడిపోవడం, తదేకంగా చూడటం, ఆందోళన, స్పృహ కోల్పోవడం, స్ట్రేంజ్ ఎమోషనల్ ఫీలింగ్, సైకోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు.
prevention of epilepsy day: తలకు గాయాలతో..మూర్ఛ ముప్పు!
మూర్ఛ జన్యుపరమైన సమస్య :ఈ మూర్ఛ వ్యాధి జన్యుపరంగా వస్తుందా? అంటే.. వైద్య నిపుణుల నుంచి 'అవును' అనే సమాధానమే వినిపిస్తోంది. దాదాపు 70% మూర్ఛ కేసులు జన్యుపరమైన కారణాలతో సంబంధం కలిగి ఉంటాయని వారు పేర్కొంటున్నారు. 2018లో 'Neuron' జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 622 మంది మూర్ఛ రోగుల DNAను అధ్యయనం చేయగా వారిలో మూర్ఛ వ్యాధికి కారణమయ్యే 19 కొత్త జన్యువులను పరిశోధకులు గుర్తించారట. ఈ జన్యు మార్పులు మెదడు కణాల మధ్య సంకర్షణను దెబ్బతీస్తాయని, ఫలితంగా మూర్ఛలు ఏర్పడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూరోజెనెటిక్స్ నిపుణుడు డాక్టర్ మైఖేల్ బౌచియా పాల్గొన్నారు. జన్యుపరమైన కారకాలు కొంతమందిలో మూర్ఛ వచ్చే అవకాశాన్ని పెంచుతాయని ఆయన చెప్పారు.
కాబట్టి.. తల్లిదండ్రులకు మూర్ఛ సమస్య ఉంటే అది పిల్లలలో కూడా సంభవించే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి ఉన్న పేరెంట్స్ తమ పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. చాలా మంది ఈ వ్యాధి విషయంలో అలర్ట్‌గా ఉండట్లేదని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు మూర్ఛ వ్యాధిగ్రస్థులను ఆసుపత్రికి తీసుకెళ్లినా.. చికిత్స చివరి వరకు కొనసాగించకుండా మధ్యలోనే వదిలేస్తారంటున్నారు. ఈ కారణంగా వ్యాధి మరింత తీవ్రంగా మారుతుంది. అలాకాకుండా.. సమయానికి చికిత్స అందిస్తే 80 నుంచి 90 శాతం మూర్ఛ రోగులలో ఈ వ్యాధి కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ 5 పనులు చేస్తున్నారా? - మీ మెదడుకు తీవ్ర ముప్పు!