Is it Good to Eat Breakfast Items at Night : చాలా మంది బరువు తగ్గేందుకు, హెల్దీగా ఉండేందుకు ఆహారం విషయంలో చాలా నియమాలు పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో కూడా తేలికగా ఉండే ఆహారం తింటుంటారు. అయితే కొందరు బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్నే.. డిన్నర్ టైమ్‌లోనూ తీసుకుంటుంటారు. కాగా, ఉదయం తినే అన్ని రకాల అల్పాహారాలు డిన్నర్‌కి సెట్ కావని నిపుణులు చెబుతున్నారు. ఏం కాదులే అని అన్నింటినీ తింటే కొన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరి డిన్నర్లో ఎలాంటి టిఫెన్స్ తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
బ్రేక్‌ఫాస్ట్‌లో పోహా, ఇడ్లీ, వడ, పూరీ, దోశ వంటి చాలా ఐటమ్స్ ఉంటాయి. డైలీ రోజుకో ఫుడ్ తీసుకుంటుంటాం. అయితే రాత్రి డిన్నర్లో లైట్ ఫుడ్ తినే వారు వీటిలో కొన్నింటిని మాత్రమే మెనూలో చేర్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రొటీన్లు అందేలా చూసుకోవాలని అంటున్నారు. అందులో భాగంగా..
- ఇడ్లీ, పోహా, ఉప్మా, ఆమ్లెట్, కిచిడీ వంటి పదార్థాల్లో ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా వీటిని రాత్రి కూడా తినొచ్చని చెబుతున్నారు.
- అలాగే కొంతమంది పెరుగులో పండ్ల ముక్కలు, నట్స్.. వంటివి కలుపుకొని బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. ఇలా రాత్రి పూట కూడా పెరుగులో పండ్ల ముక్కలు, నట్స్ కలుపుకుని తింటే మంచిదంటున్నారు. ఈ విధంగా తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని. ఫలితంగా బరువు అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు.
- శనగ పిండి దోశ కూడా ట్రై చేయవచ్చుంటున్నారు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్.. జీర్ణశక్తిని పెంచి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుందంటున్నారు. పైగా కేలరీలు కూడా ఇందులో తక్కువేనట.
వీటికి దూరంగా ఉండండి:పూరీ, వడ, పకోడీ, సమోసా, పరాఠా వంటి నూనె పదార్థాలు.. నైట్ తినకూడదని చెబుతున్నారు. అలాగే బేకరీ ఐటమ్స్, ప్యాన్‌కేక్స్ నైట్ తినకుండా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉపయోగాలెన్నో!
- నైట్ లైట్‌గా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌లు తినడం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని.. దీనివల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతున్నారు.
- రాత్రి సమయంలో తేలికగా జీర్ణమయ్యే, ఫైబర్ ఎక్కువగా ఉండే అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందంటున్నారు.
- 2018లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నైట్ తేలికగా ఉండే ఆహారం తినడం వల్ల వల్ల గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) లక్షణాలు తగ్గిపోయి జీర్ణక్రియ మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సెయింట్ లూయిస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన 'డాక్టర్ ఎం.క్లారెట్' పాల్గొన్నారు.
- నేటి ఆధునిక జీవితంలో ఉద్యోగాలు, పని ఒత్తిడి కారణంగా చాలా మందికి రాత్రి భోజనం తయారుచేసుకునే సమయం ఉండట్లేదు. దీంతో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటున్నారు. ఇలా తింటే హెల్త్ పాడవుతుంది. ఇలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇన్‌స్టాంట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లు రెడీ చేసుకుంటే మంచిదంటున్నారు.
- నైట్ తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు.
- అయితే నైట్ ఎలాగూ లైట్ ఫుడ్ తీసుకుంటున్నాం కదా అని ఎక్కువ మొత్తంలో లాగించేయడం, ఆలస్యంగా తినడం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ల సలహా మేరకు తీసుకునే ఆహారం మోతాదు నిర్ణయించుకోవడం, పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం ముగించడం మంచిదని చెబుతున్నారు.