Weight Loss Salads for Lunch:ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి.. ఇలా పలు కారణాల వల్ల ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. అధిక బరువు వల్ల గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత, లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలోనే బరువు ఎక్కువ ఉన్నవారు ఎలాగైనావెయిట్ లాస్(Weight Loss) అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి బరువు పెరగడం సులభం, కానీ దానిని తగ్గించడం అంత సులువైన పని కాదు. మరి మీరు కూడా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. ఓసారి మీ డైట్లో లంచ్‌కు బదులుగా ఈ సలాడ్స్ చేర్చుకుంటే.. ఈజీగా బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యకరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
గ్రీక్ సలాడ్ : బరువు తగ్గాలనుకునే వారికి ఈ క్లాసిక్ మెడిటరేనియన్ సలాడ్ మధ్యాహ్న భోజనం కోసం ఆరోగ్యకరమైన ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. టమాటాలు, కీరదోసకాయలు, ఎర్ర ఉల్లిపాయలు, కలమటా ఆలివ్‌లు, ఫెటా చీజ్ లాంటి పదార్థాలు గ్రీక్ సలాడ్‌లో ఉంటాయి. అలాగే ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఒరేగానోతో ఈ సలాడ్‌ను సింపుల్‌గా గార్నిష్ చేసుకుని తినొచ్చు.
గ్రిల్డ్ చికెన్ అవకాడో సలాడ్ : ఈ సలాడ్ కూడా బరువు తగ్గడానికి బెటర్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇందులో గ్రిల్డ్ చికెన్, అవకాడో కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఈ సలాడ్ మరింత రుచికరంగా, పోషకరమైన ఆహారంగా మారడానికి కొన్ని టమాటాలు, కీర దోసకాయ ముక్కలు, ఫెటా చీజ్‌ను యాడ్ చేసుకోవచ్చుంటున్నారు.
రోస్టెడ్ వెజిటబుల్స్ క్వినోవా సలాడ్ : క్వినోవాలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఆరోగ్యకరమైన భోజన ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సలాడ్ కోసం ముందుగా బంగాళాదుంపలు, బెల్ పెప్పర్స్, బ్రోకలీ వంటి మీకు ఇష్టమైన కూరగాయలను రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత రుచి కోసం దానికి కొద్దిగా ఉడికించిన క్వినోవాను యాడ్ చేసుకోవాలి. అలాగే చివరగా పుదీనా, నిమ్మరసం, ఆలివ్ నూనెతో సింపుల్‌గా గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన సలాడ్ రెడీ. ఇక లంచ్‌కు బదులుగా దీనిని తిన్నా మంచి ప్రయోజనాలు ఉంటాయి.