walking_health_benefits (ETV Bharat) Trouble in Walking : చాలామంది నడక చాలా సులువని అనుకుంటారు. కానీ, అది అత్యంత సంక్లిష్టమైంది. కాళ్లు కదిలించడం, చేతులు ముందుకు వెనక్కు ఆడించడంతో పాటు కడుపు, వీపు, నడుము భాగంలోని కండరాలు మెదడు మధ్య ప్రసారమయ్యే సంకేతాలు ఇందులో పాల్పంచుకుంటాయి. సాఫీగా నడవటం, నడక వేగం శరీర ఆరోగ్యాన్నీ తెలియజేస్తాయని తెలుసా? వృద్ధాప్యం ముంచుకొస్తున్న తీరునూ నడక వివరిస్తుందని గమనించారా?
నడకలో పడిపోవటం, తూలటం వంటివి గమనిస్తే జాగ్రత్త పడటం తప్పదంటున్నారు వైద్యులు. నడవటం కష్టంగా అనిపిస్తున్నా తాత్సారం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి కారణమేంటో గుర్తిస్తే చికిత్సతో ప్రమాదాల బారి నుంచి బయటపడొచ్చు.
బరువు తగ్గడం లేదని బాధపడుతున్నారా?- తింటూనే బరువు తగ్గొచ్చని తెలుసా! - diet plan for weight loss
40ఏళ్లు పైబడిన వారిలో..
వయసు పైబడుతుంటే కండర మోతాదు, బలం, నాణ్యత తగ్గుతుంటుంది. దీనినే సార్కోపీనియా అంటారు. ఇది 40ఏళ్లు పైబడిన వారిలో గమనించవచ్చు. మరోవైపు నాడీ వ్యవస్థ కూడా క్షీణిస్తూ.. శరీరం మొత్తమంతా విస్తరించి ఉన్న నాడుల సామర్థ్యం, నాడీ కణాల సంఖ్య తగ్గుతుంది. 20-60 ఏళ్ల మధ్యలో ఏటా 0.1% చొప్పున నాడీకణాలు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అరవై ఏళ్లు దాటాక నాడీ కణాల క్షీణత వేగం మరింత పెరుగుతుంది. 90 ఏళ్లు బతికిన వారిలో... 50 ఏళ్ల వయసు నాటితో పోలిస్తే మెదడు కణజాలం బరువు 150 గ్రాముల తక్కువగా ఉంటుంది. అందుకే నడకను శారీరక, మానసిక ఆరోగ్యానికి సూచికగా పరిగణించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
walking_health_benefits (ETV Bharat) పార్కిన్సన్స్ తొలిదశ సంకేతం
నడక వేగం తగ్గటం, సాఫీగా నడవకపోవటం పార్కిన్సన్స్ వంటి నాడీ క్షీణత సమస్యలకు తొలిదశ సంకేతమని వైద్యులు చెప్తున్నారు. మెదడు నుంచి ఎముకలకు అంటుకొనే కండరాలకు సంకేతాలు అందటం తగ్గిపోయి నడిచే తీరు నెమ్మదిస్తుంది. నడక ఒక తీరుగా కాకుండా తడబడటం ఎక్కువవుతుంది. పార్కిన్సన్స్ తొలిదశలో ఇలాంటి లక్షణాలు చాలా తక్కువగా కనిపించినా నాడులు క్షీణించటం వల్ల అడుగుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. ఒక్కో అడుగు వేయడానికి అధిక సమయం పడుతుంది.
యోగాసనాలూ కారణం కావచ్చు..
మోకాలు నుంచి మడమ వరకూ ఉండే కండరాలు పాదాన్ని పైకి లాగి ఉంచుతాయి. అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు పాదం పైకి లేవడానికి అవి సహకరిస్తాయి. కానీ, కొందరిలో పాదం ముందుకు వంగిపోతుంటుంది. దీనినే ఫుట్ డ్రాప్ అని అంటారు. దీంతో వేళ్లు నేలకు తాకి, కింద పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి లక్షణం ఎక్కువగా మధుమేహం కారణంగా నాడులు దెబ్బతిన్నవారిలో గమనించవచ్చు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, లేదా ఎక్కువసేపు యోగాసనాలు వేయడం కూడా కారణం కావొచ్చు.
రక్తనాళాలు కుంచించుకుపోయి...
కొందరిలో నడుస్తున్న సమయంలో పిరుదు కండరాల్లో నొప్పి మొదలై, అది కాలి వెనక నుంచి కిందికి... పిక్క వరకూ నొప్పి విస్తరించొచ్చు. నడవటం ఆపేస్తే నొప్పి తగ్గుతుందంటే దీనికి మూలం కాళ్లలో రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటం అని గ్రహించాలి. నడిచినప్పుడు నొప్పి రావడం, ఆగినప్పుడు నొప్పి తగ్గటాన్ని క్లాడికేషన్ అంటున్నారు వైద్యులు. రక్తనాళాలు కుంచించుకుపోయినప్పుడు కాళ్లకు రక్త సరఫరా తగ్గిపోతుంది. వాస్తవానికి నడుస్తున్నప్పుడు కాలి కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంటుంది. తగినంత రక్తం సరఫరా కాకపోతే ఆక్సిజన్ అందక లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది. తద్వారా కండరాలు పట్టేసిన భావన కలిగించి నడక ఆపేయాలనిపిస్తుంది. నడక ఆపేసినప్పుడు కండరాలకు అంత ఆక్సిజన్ అవసరముండదు కాబట్టి నొప్పి వెంటనే తగ్గడాన్ని గమనించవచ్చు. ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, కుటుంబంలో ఎవరికైనా రక్తనాళాల సమస్యలు ఉండటం వంటివి రక్తనాళాలు కుచించటానికి కారణమవుతుంటాయి.
విటమిన్ లోపాలూ కారణమే..
విటమిన్ లోపం కూడా నడక మందగించడానికి మరో కారణమని వైద్యులు చెప్తున్నారు. నడుస్తున్నప్పుడు తడబడితే విటమిన్ బి12 లోపంగా భావించాలి. పెద్దవారిలో బి12 లోపం లక్షణాలు బయట పడటానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది. కానీ నాడీ వ్యవస్థ పరిపక్వమవుతున్న పిల్లల్లో తక్కువ కాలంలోనే ఈ లోపాన్ని గుర్తించవచ్చు. నాడీ వ్యవస్థను కాపాడటంలో కీలక పాత్ర పోషించే విటమిన్ బి12 లోపాన్ని సరిచేసుకోవటం తేలికే. మాత్రలు, అవసరమైతే ఇంజెక్షన్లు, మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, మజ్జిగ వంటి ఆహారం ఎంతో ఉపయోగపడుతుంది.
కళ్లకు, చెవికి పొంతన లేకుంటే ప్రమాదమే..
లేబీరైనైటిస్ అనే లోపలి చెవి సమస్యలూ నడక తీరుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. నడుస్తున్నపుడు తూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇవి చాలావరకూ వాటంతటవే తగ్గుతాయని వైద్యులు అంటున్నారు. మనం నిల్చున్నామా, కూర్చున్నామా అనే విషయాన్ని చెవిలోని ద్రవం నుంచి అందే సంకేతాలతోనే మెదడు నిర్ణయించుకుంటుంది. లోపలి చెవి ఇన్‌ఫెక్షన్‌కు గురైతే చెవిలోని ద్రవం కదలికలు అస్తవ్యస్తమై చెవి నుంచి అందే సంకేతాలను పోల్చుకోవటంలో మెదడు తికమకపడుతుంది. కళ్లకు కనిపించే దృశ్యానికి, చెవి నుంచి అందే సంకేతాలకు పొంతన కుదరక తూలిపోయే ప్రమాదం ఉంది.
ఇదిలా ఉంటే హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి నడక చక్కని మార్గమని సీనియర్ కార్డియాలజిస్ట్ డా.గూడపాటి రమేశ్ ఈటీవీ భారత్కు వెల్లడించారు. వ్యాయామం ఎంత సేపు చేయాలనే విషయంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
హెన్నా పెట్టే ముందు జుట్టు కడుగుతున్నారా?- ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! - henna powder
చేదుగా ఉందని దూరం పెడితే ఎలా?- ఆ కూరగాయ ఖనిజాల గని - Bitter Guard Benefits