Diabetes Patient Can Eat Curd : మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి, శారీరక శ్రమకు దూరంగా ఉండటం వంటి వివిధ కారణాల వల్ల నేడు ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధితో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే చాలు ఏది తినాలన్నా షుగర్ పేషెంట్లు ఎన్నో సార్లు ఆలోచిస్తుంటారు. అయితే, చాలా మంది డయాబెటిస్ ఉన్న వారికి పెరుగు తినవచ్చా? అనే సందేహాం కలుగుతుంటుంది. అలాగే వైట్ సాల్ట్‌ను కూడా వాడవచ్చా? దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే అవకాశం ఉందా? అనే అనుమానం కలుగుతుంటుంది. అయితే, చక్కెర వ్యాధితో బాధపడేవారు వారి ఆహారంలో వీటిని కొంచెం తక్కువ మొత్తంలో తీసుకోవడమే.. మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం షుగర్ ఉన్నవారు పెరుగు తింటే ఏమవుతుంది ?
డయాబెటిస్‌తో బాధపడేవారు పెరుగు తినడం వల్ల శరీరంలో కఫ దోషం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందట. అలాగే పెరుగును తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు కూడా అధికమవుతాయని అంటున్నారు. అందుకే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు పెరుగు తినడం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే బరువు ఎక్కువగా ఉన్నావారు, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు కూడా పెరుగుకు దూరంగా ఉండటమే ఆరోగ్యానికి మంచిదని తెలియజేస్తున్నారు. షుగర్ పేషెంట్లు నేరుగా పెరుగు తీసుకోకుండా.. మజ్జిగ రూపంలో తీసుకోవచ్చని అంటున్నారు.
వైట్ సాల్ట్‌తో ప్రమాదం ఉందా..?
షుగర్ వ్యాధితో బాధపడేవారు వైట్ సాల్ట్‌ను తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు పెరగకపోయినా కూడా.. అది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులంటున్నారు. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ వంటివి వస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే చక్కెర వ్యాధితో సతమతమయ్యేవారు వైట్ సాల్ట్‌కు బదులుగా హిమాలయన్ పింక్ ఉప్పును ఉపయోగించాలని సూచిస్తున్నారు.
బెల్లం తింటే ఏమవుతుంది ?
కొంత మంది మధుమేహం వ్యాధి ఉన్న వారు తినే ఆహార పదార్థాలలో చక్కెరకు బదులుగా బెల్లన్ని చేర్చుకుంటారు. దీనివల్ల కూడా వారి శరీరంలో చక్కెర స్థాయులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, షుగర్ పేషెంట్లు వారి ఆహారంలో బెల్లం ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.