Daytime Sleepiness Reasons:మనలో చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పనివేళల్లోనే నిద్ర ముంచుకు వస్తుంది. ఫలితంగా సరిగ్గా పనిచేసేందుకు శరీరం కూడా సహకరించదు. దీంతో ఏ పని మీద దృష్టి పెట్టలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే అసలు పగటి పూట నిద్ర రావడానికి కారణాలేంటి? ఈ సమస్య చెక్ పెట్టేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం: పగటి పూట నిద్ర రావడానికి రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయడం కూడా కారణమేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆలస్యంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన 3 నుంచి 4 గంటల తరవాత నిద్రపోవాలని.. అందుకే వీలైనంత తొందరగా రాత్రి భోజనం చేయాలని సూచిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో ఏ ఆహారం అయినా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం: ప్రస్తుతం కాలంలో చాలామంది ఫోన్, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అయితే, రాత్రి తక్కువ వెలుతురులో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత మేరకు ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని భోజన సమయానికి ముందు వరకు పరిమితం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని సలహా ఇస్తున్నారు.
సరైన నిద్ర కూడా అవసరమే: పగటి పూట నిద్రపోకుండా ఉండేందుకు రాత్రి సమయంలో హాయిగా పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సుఖమైన నిద్ర కోసం మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా బాగుండాలని.. గదిలోకి వెలుతురు లేకుండా చూసుకోవాలని అంటున్నారు. ఇంకా రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఆల్కహాల్ వినియోగం: ఇంకా ఆల్కహాల్ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా నిద్రలేమి సమస్య ఏర్పడి శరీర ఆరోగ్యవ్యవస్థ మీద ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.