Cleft Lip & Cleft Palate Treatment Timeline :పై పెదవిలో ఏర్పడే చీలికను గ్రహణం మొర్రి లేదా చీలిక పెదవి లేదా దొర్రి పెదవి అని పిలుస్తారు. ఈ గ్రహణం మొర్రి అనేది తల్లి గర్భంలోనే ఏర్పడుతుందని, బిడ్డకు పుట్టుకతోనే ఇది వస్తుందని వైద్యులు చెబుతున్నారు. జన్యు సంబందిత లోపాలు, కణజాలం అభివృద్ధిలో సమస్యలతో శిశువు ఇలాంటి చీలిక పెదవితో జన్మిస్తుందని అంటున్నారు. దీన్ని ఆంగ్లంలో క్లెఫ్ట్ లిప్ అని పిలుస్తారు. అంగిలిలో కూడా ఇలాంటి చీలిక ఉంటి దానిని క్లెఫ్ట్ పాలెట్ అని పిలుస్తారు. ఈ రెండూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అసాధారణ కణజాల వృద్ధిలో వచ్చే జన్యుపరమైన ఇబ్బందులని వైద్యులు తెలియజేస్తున్నారు.
గ్రహణం మొర్రి అనేది మేనరికం పెళ్లిళ్ల వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ప్రముఖ డెర్మటాలజిస్ట్ స్వప్న ప్రియ వెల్లడించారు. ఈ సమస్యతో బాధపడేవారు ఎలాంటి ఏజ్‌లో నైనా సర్జరీ చేయవచ్చని తెలిపారు. ఈ సర్జరీ వల్ల మాట తీరులో మెరుగు పడుతుందని తెలిపారు. ముఖంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. చికిత్సతో గ్రహణం మెుర్రి సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆమె వెల్లడించారు.
ఎప్పుడు ఏర్పడుతుంది ? : సాధారణంగా పిండంలో ఆరు నుంచి 9 వారాల సమయంలో అంగిలి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరిలో అంగిలి కణజాలం పూర్తిగా కలవదని, అందువల్ల ముక్కు, నోరు మధ్య ఖాళీగా కనిపిస్తుందంటున్నారు వైద్యలు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో 1-25 మంది గ్రహణం మొర్రితో పుడుతుంటారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనికి శస్త్రచికిత్స చేసి సరిచేయాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం:గ్రహణం మొర్రి అనేది పుట్టుకతో వచ్చే సమస్య. ఈ సమస్యకు ఆరంభంలోనే సత్వరం చికిత్స చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. గ్రహణం మొర్రి (క్లెఫ్ట్) విషయంలో ఇది మరింత ముఖ్యమని కరోలిన్‌స్కా యూనివర్సిటీ హాస్పిటల్ నిర్వహించిన అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది. పన్నెండు నెలల వయసులో గ్రహణం మొర్రి శస్త్రచికిత్స చేయటంతో పోలిస్తే, ఆరు నెలల సమయంలో పిల్లలకు చికిత్స చేసి సరిచేస్తే మాటలు రావటం, భాషా నైపుణ్యాలు అబ్బటం మెరుగ్గా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. NLM కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. (National Librabry of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).