Daily Smoking One Cigarette What Happens in Body?: 'డైలీ ఒక సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదా?' అంటే.. వైద్య నిపుణుల నుంచి 'నో' అనే సమాధానమే వినిపిస్తోంది. రోజూ ఒక సిగరెట్ తాగినా ఆరోగ్యానికి హానికరమే అని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు.. డైలీ ఒక సిగరెట్ తాగడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందో కూడా చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
గుండె జబ్బులు :ధూమపానం(Smoking)గుండెకు హాని కలిగిస్తుందంటున్నారు నిపుణులు. సిగరెట్ పొగ ధమనులను సంకోచం చెందిస్తుంది. దాంతో గుండె నుంచి రక్త సరఫరా బాడీలోకి సక్రమంగా జరగదు. తద్వారా గుండె పోటుకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా.. బీపీ పెరుగుతుందని, రక్తం గడ్డకట్టే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు.
ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది : రోజుకో సిగరెట్ తాగడం శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. స్మోకింగ్ శ్వాసనాళాలను, ఊపిరితిత్తులలోని చిన్న గాలి సంచులను (అల్వియోలీ) దెబ్బతీస్తుంది. ఇది ఎంఫిసెమా, క్రానిక్ బ్రోన్కైటిస్ వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని సూచిస్తున్నారు.
సంతానోత్పత్తి సమస్య :స్మోకింగ్.. పురుషులు, స్త్రీలలో వంధ్యత్వ సమస్య పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా సిగరెట్ తాగితే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడంతో పాటు అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయంటున్నారు. అదే.. మహిళలలో ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
నోటి ఆరోగ్యానికి హాని : రోజుకో సిగరెట్ తాగడం దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా.. నోటి దుర్వాసన, దంతాల నష్టం, చిగుళ్లు వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు.. స్మోకింగ్ అలాగే కొనసాగితే నోటిలో తారు, నికోటిన్ మూలాలు పేరుకుపోయి నోటి క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు.
కంటి సమస్యలు : ధూమపానం కంటి ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా సిగరెట్ పొగలోని విష రసాయనాలు సున్నితమైన కంటి కణజాలాన్ని దెబ్బతీసి కంటి శుక్లం ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు. ఇది క్రమంగా దృష్టి క్షీణతకు, అంధత్వానికి దారితీస్తుందని చెబుతున్నారు.