Thyroid Symptoms in Telugu: ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు దూరంగా ఉండడం వంటి కారణాల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. ఈ థైరాయిడ్‌తో పిరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం, బరువు పెరగడం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే థైరాయిడ్ సమస్య ఎందుకొస్తుంది? దీన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా? వంటి ప్రశ్నలకు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
థైరాయిడ్ సమస్యకు శరీరంలోని హార్మోన్ స్థాయుల్లో తేడాలే కారణమని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పీవీ రావు చెబుతున్నారు. T3, T4, TSH అనే హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల వల్ల థైరాయిడ్ గ్రంథి వేగంగా లేక నెమ్మదిగా పని చేస్తుందని అంటున్నారు. హార్మోన్లు ఎక్కువగా విడుదలైతే థైరాయిడ్ గ్రంథి వేగంగా పనిచేస్తుందని.. దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారని వివరిస్తున్నారు. అదే తక్కువగా విడుదలైతే థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోతుందని.. దీన్ని హైపో థైరాయిడిజం అని పిలుస్తుంటారు.
హైపో థైరాయిడిజం లక్షణాలు
- ఆకలి లేకపోవడం
- బరువు పెరగడం
- త్వరగా అలసిపోవడం
- మలబద్ధకం
- నెలసరి క్రమం తప్పడం
- జుట్టు విపరీతంగా రాలడం
- చర్మం పొడిగా మారడం
- చలికి తట్టుకోలేకపోవడం
హైపర్ థైరాయిడిజం లక్షణాలు
- సరిగానే తింటున్నా విపరీతంగా బరువు తగ్గడం
- నిద్ర పట్టక పోవడం
- చేతులు వణకడం
- మానసిక ఒత్తిడి
- చల్లగా ఉన్న వేళల్లోనూ వేడిగా అనిపించడం
- ఎక్కువగా చెమటలు పట్టడం
- నెలసరి క్రమం తప్పడం
- ఎక్కువసార్లు మలవిసర్జనకు వెళ్లాల్సి రావడం
ఏం చేయాలి?
అయితే, థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవడానికి కనీసం ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా డాక్టర్లు సూచించిన ప్రకారం మందులు వాడాలని సలహా ఇస్తున్నారు. దీంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించడమూ ముఖ్యమేనని అంటున్నారు. ఇందుకోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు వాకింగ్, వ్యాయామం, డ్యాన్స్, యోగా లాంటివి చేయాలని వెల్లడిస్తున్నారు.
థైరాయిడ్ ఉన్నవాళ్లు తీసుకోవాల్సినవి
- జింక్, రాగి ఎక్కువగా లభించే పదార్థాలు
- అయొడిన్ ఉన్న ఉప్పు
- అరటిపండ్లు
- క్యారట్లు
- పచ్చసొన
- వెల్లుల్లి
- పాలకూర
- ఉల్లిపాయలు
- బంగాళదుంపలు
- పుట్టగొడుగులు
- ఓట్‌మీల్
- చేపలు
- నట్స్
థైరాయిడ్ ఉన్న వాళ్లు తీసుకోకూడని పదార్థాలు
- క్యాబేజీ
- క్యాలీఫ్లవర్
- బ్రకలీ
- సోయా
- చిక్కుళ్లు
ముఖ్యంగా ఒత్తిడి కూడా థైరాయిడ్ హార్మోన్‌పై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దాన్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించాలని వివరిస్తున్నారు. ఇంకా ప్రాణాయామం లాంటివి సాధన చేస్తే ఒత్తిడిని పెంచే హార్మోన్లు అదుపులో ఉండి చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చట్నీలను ఫ్రిజ్‌లో పెట్టి తింటున్నారా? నాన్‌వెజ్ పెట్టినా కూడా బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్!
పిల్లలకు తినేటప్పుడు ఫోన్లు ఇస్తున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?