Causes Of NAFLD In Children :మారిపోయిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. పెద్దవాళ్లనే కాదు.. పిల్లలనూ ఈ సమస్యలు వేధిస్తున్నాయి. అలాంటి వాటిలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ఒకటి. దీనివల్ల చిన్నవయసులోనే కాలేయం దెబ్బతినడం వంటి తీవ్రమైన అనారోగ్యంతోపాటు, టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదంఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. పిల్లల్లో NAFLD సమస్య రావడానికి గల కారణాలు ఏంటీ ? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణ ఎలా? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఫ్యాటీ లివర్ అంటే?
అతిగా ఆహారం తిన్నప్పుడు.. ఆ తీసుకున్న ఆహారం మొత్తాన్నీ కాలేయం ప్రాసెస్ చేయలేకపోతుంది. ఇలా ప్రాసెస్ చేయలేక మిగిలిన ఫుడ్ మొత్తం కొవ్వు రూపంలోకి మారి, కాలేయంలో పేరుకుపోతుంది. ఈ సమస్య ఎక్కువగా మద్యం తాగే వారిలో వస్తుంది. కానీ.. మద్యం అలవాటు లేకపోయినా కూడా.. కొందరిలో ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య వస్తుంది. దీన్నే NAFLD అంటారు.
పిల్లల్లో NAFLD రావడానికి కారణాలు ?
- అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే.. పిల్లల్లో NAFLD సమస్య రావడానికి ప్రధాన కారణం.
- ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు ఉండే పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని తరచుగా తినడం వల్ల NAFLD సమస్య వస్తుంది.
- అలాగే పిల్లలు ఆటలు ఆడకపోతే.. మార్నింగ్ వర్కవుట్స్ చేయకపోతే.. శారీరక శ్రమకు దూరమైపోతారు. ఫలితంగా కూడా NAFLD వస్తుంది.
- ఇంకా.. ఇళ్లలో ఎక్కువ సేపు టీవీలు, సెల్‌ఫోన్లకే అతుక్కుపోయి బరువు పెరగడం వల్ల కూడా NAFLD బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లక్షణాలు ?
- కొంత మంది పిల్లల్లో NAFLD లక్షణాలు కనిపించకపోవచ్చు.
- కొంతమంది పిల్లల్లో మాత్రం.. కడుపు నొప్పి, అలసట, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- 2017లో ప్రచురించిన 'జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్' నివేదిక ప్రకారం NAFLD సమస్య ఉన్న పిల్లల్లో కడుపు నొప్పి, అలసట, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయట. ఈ పరిశోధనలో 8-19 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న 10,739 మంది పిల్లలు పాల్గొన్నారు.
- పరిస్థితి తీవ్రమైతే.. కొంత మంది బరువు తగ్గుతారు.
- కాళ్లు వాపు కూడా వస్తుంది.
- కామెర్లు లేదా చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.