Foot Pain A Sign Of High Cholesterol : సాధారణంగా అధిక కొలెస్ట్రాల్ ఎటువంటి లక్షణాలు చూపించదు. కానీ నిదానంగా ఇది మీ గుండెకు ప్రమాదకరంగా మారుతుంది. కొలెస్ట్రాల్ అనేది కాలేయం ఉత్పత్తి చేసే కొవ్వు లాంటి పదార్థం. ఇది ధమనులలో పేరుకుపోయి గుండె పోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉందని గుర్తిండానికి ఎక్కువ సంకేతాలు లేవు. కానీ, మీ పాదాల్లో అసౌకర్యం, మంట, నొప్పి వంటివి మాత్రం అధిక కొలెస్ట్రాల్ కారణంగా కలిగే సమస్యలేనని చెబుతున్నారు నిపుణులు. చేతులు లేదా కాళ్ల ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రవాహం తగ్గినప్పుడు ఈ సమస్యకు దారితీస్తుంది. దీన్నే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్(PAD) అని పిలుస్తారు వైద్యులు.
రాత్రి పూట ఎలా ప్రభావితం చేస్తుంది?
అధిక కొలెస్ట్రాల్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్(PAD)కు మధ్య ఉన్న ప్రధాన సంబంధం ఏంటంటే అథెరోస్క్లెరోసిస్ ప్రక్రియ. ధమని గోడలలో తక్కువ సాంద్రత కలిగిన 'లో' డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL cholesterol)ను పోగు చేస్తుంది. ఇది ధమనులను గట్టిపరుస్తుంది. కాళ్లు, పాదాలు వంటి అంత్య భాగాలకు రక్త ప్రవాహం తగ్గిపోతుంది. ఫలితంగా విపరీతమైన కాలు నొప్పి, తిమ్మిరి వంటి ఇబ్బందులు వస్తుంటాయి. ముఖ్యంగా శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అంటే రాత్రి పూట సమస్య తీవ్రమవుతుందని వైద్యులు అంటున్నారు.
పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ నేరుగా నిర్థారింలేమని, ఒక్కమాటలో చెప్పాంటే లక్షణాలు చూపించని సమస్య అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చాలా మంది ఈ సమస్యను వృద్ధాప్య చిహ్నంగా భావిస్తారు. నిజానికి వయసు పైబడితే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ సమస్య చాలా తీవ్రంగా మారుతుంది. అందుకే ముందే గుర్తిస్తే గుండె సమస్యలు, స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.
పీఏడీ లక్షణాలు
ఎప్పుడూ పాదాలు చల్లగా :మీరు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్‌తో ఇబ్బంది పడుతున్నారంటే మీ పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగ్గా జరిగినప్పుడు పాదాలు వెచ్చగా ఉంటాయి. ధమనులు కొలెస్ట్రాల్‌తో పేరుకుపోయి రక్త ప్రసరణ తగ్గినప్పుడు శరీర ఉష్టోగ్రతలో తేడాలు వస్తాయి. దీంతో గుండెకు రక్తప్రసరణ తగ్గించే గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉన్నట్లే.
వాపు :కాళ్ల వాపు, ఎడెమా సమస్యకు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ కూడా కారణమయి ఉండొచ్చు. కొన్ని సార్లు కాళ్లును ఎక్కువ సేపు కదలకుండా ఉంచడం వల్ల కూడా వాపు సమస్య వస్తుంటుంది. తరచుగా మామూలుగానే వాపు వస్తే దీన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్‌గా అనుమానించాల్సిన అవసరం ఉంది.
తరచుగా నొప్పి :పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అత్యంత సాధారణ లక్షణాలలో కాళ్ల నొప్పి ఒకటని వైద్యులు చెబుతున్నారు. కాళ్లను సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తుంది. పాదాలు, తొడల భాగంలో తరచుగా నొప్పి వస్తుంటుంది.