తెలంగాణ

telangana

ETV Bharat / health

పరగడుపునే జ్యూసులు తాగొచ్చా? ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? - DRINKING FRUIT JUICE IN MORNING

-పరగడుపునే పండ్ల రసాలు తాగితే అనారోగ్యం -ఏ సమయంలో జ్యూస్ తాగితే మంచిదో తెలుసా?

Can We Drink Fruit Juice in Empty Stomach
Can We Drink Fruit Juice in Empty Stomach (Getty Images)

By ETV Bharat Health Team

Published : Jan 2, 2025, 10:36 AM IST

Can We Drink Fruit Juice in Empty Stomach:ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే చాలా మందికి ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ చేసే సమయం కూడా ఉండదు. ఈ క్రమంలోనే కొందరు తక్షణమే రెడీ అయ్యే ఆహార పదార్థాలపై ఆధారపడుతుంటారు. ముఖ్యంగా చిటికెలో సిద్ధం చేసుకొనే పండ్ల రసాలను పరగడుపునే తీసుకుంటూ ఆకలి తీర్చుకుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరగడుపునే పండ్ల రసాలు తాగడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఇంతకీ అవేంటి? పండ్ల రసాలు తాగడానికి సరైన సమయం ఏది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెర స్థాయులతో
పండ్లను జ్యూస్‌ చేసే క్రమంలో తియ్యదనం కోసం చక్కెర కలుపుతుంటారు చాలా మంది. అయితే, పండ్లలో సహజంగానే చక్కెర ఉంటుందని.. అదనంగా కలపడం వల్ల జ్యూసుల్లో చక్కెర స్థాయులు పెరిగిపోతాయని నిపుణులు అంటున్నారు. వీటిని పరగడుపునే తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయులు మరింతగా పెరుగుతాయని.. ఈ అలవాటు దీర్ఘకాలంలో మధుమేహ ముప్పును పెంచే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పరగడుపునే పండ్ల రసాల్ని తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. 2013లో Journal of Agricultural and Food Chemistryలో ప్రచురితమైన "Fruit juice consumption and risk of type 2 diabetes" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఎనామిల్‌ తొలగిపోతుంది!
ఇంకా పరగడుపునే పండ్ల రసాల్ని తీసుకోవడం వల్ల దంతాల పైనా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ఆమ్లత్వం దంతాలపై ఉండే ఎనామిల్‌ పొరను తొలగిస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా దంత క్షయం, చిగుళ్లు-పళ్లలో సున్నితత్వం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో తీసుకునే ఆహారం చల్లగా, వేడిగా ఉన్నా దంతాలు తట్టుకోలేవని అంటున్నారు. అందుకే పరగడుపునే పండ్ల రసం తాగడం మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

జీర్ణ సమస్యలు!
దానిమ్మ, ద్రాక్ష, బ్లూబెర్రీ, పైనాపిల్‌ వంటి పండ్లలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని జ్యూసులుగా తయారుచేసుకొని పరగడుపునే తాగడం వల్ల వీటిలోని ఆమ్లత్వం జీర్ణాశయ గోడల్ని దెబ్బతీస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా దీర్ఘకాలంలో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు కడుపునొప్పి, కడుపులో మంట.. తదితర సమస్యలు తలెత్తచ్చని అంటున్నారు. అందుకే పరగడుపున పండ్ల రసాలు తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

ఆహారపు కోరికలు!
పరగడుపునే పండ్ల రసాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు ఒకేసారి పెరిగిపోవడం, ఆపై కాసేపటికి అమాంతం పడిపోవడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తక్షణ హెచ్చుతగ్గుల కారణంగా శరీరంలో శక్తి క్షీణించి అలసట దరిచేరుతుందని వివరిస్తున్నారు. ఈ శక్తిని తిరిగి భర్తీ చేసుకోవడానికి శరీరం క్యాలరీలున్న ఆహారాన్ని కోరుకుంటుందని అంటున్నారు. ఫలితంగా వీటిని తీసుకుని బరువు పెరుగుతామని.. పైగా ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని వెల్లడిస్తున్నారు. కాబట్టి పరగడుపునే పండ్ల రసాలు తాగకూడదని నిపుణులు అంటున్నారు.

భోజనంతో పాటు!
పరగడుపునే పండ్ల రసాల్ని తీసుకొని వివిధ రకాల అనారోగ్యాల్ని కొని తెచ్చుకోవడం కంటే.. మధ్యాహ్నం భోజనంతో పాటు తీసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల పలు ప్రయోజనాలూ చేకూరతాయని అంటున్నారు.

  • భోజనంతో పాటే పండ్ల రసాల్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే ఆకలినీ నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు.
  • ఇంకా భోజనానికి పది నిమిషాల ముందు గ్లాసు పండ్ల రసం తాగితే కడుపు నిండిన భావన కలుగుతుందని చెబుతున్నారు. ఫలితంగా అన్నం తక్కువగా తిని.. బరువునూ అదుపులో ఉంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
  • పండ్ల రసాలు మనం తీసుకున్న ఆహారంలోని పోషకాల్ని శరీరం త్వరగా గ్రహించేందుకు దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే వీటి నుంచి పలు పోషకాలు కూడా శరీరానికి అందుతాయని చెబుతున్నారు. తద్వారా పోషకాహార లోపం తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని నిపుణులు వివరిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం తినాలి? ఈ మార్పులు చేయకపోతే ఇబ్బంది పడే ఛాన్స్!

'మెట్లు ఎక్కితే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువ'- రోజు ఎన్ని ఎక్కాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details