Can We Add Sugar To Baby Milk : బిడ్డకు పాలివ్వడం తల్లికి అంత సులువైన పనేం కాదు. దీని వల్ల మహిళ శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి. శరీరంలో శక్తి క్షీణించడం సహా వెంట్రుకల, చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందువల్లే.. ప్రస్తుతం చాలా మంది తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వడం మానేసి, డబ్బా పాలు పడుతున్నారు. అదే సమయంలో పాలు స్వీట్గా ఉంటే చక్కగా తాగుతారనే ఉద్దేశంతో.. చక్కెర కలుపుతుంటారు. మరికొందరు గ్లూకోజ్ వంటివి మిక్స్ చేస్తుంటారు. మరి.. ఇలా కలపడం మంచిదేనా? వీటికి డాక్టర్లు ఏం సమాధానాలు చెబుతున్నారు? అన్నది ఇప్పుడు చూద్దాం.
"పిల్లలకు ఏడాది వయసు దాటగానే కేవలం డబ్బా పాలు మాత్రమే కాకుండా.. ఆవుపాలు, ప్యాకెట్ పాలు ఇవ్వొచ్చు. వీటిలో నీరు కలపాల్సిన అవసరం లేదు. పిల్లలు చక్కెర లేకుండా పాలు తాగుతుంటే అలానే ఇవ్వొచ్చు. ఒకవేళ తాగకపోతే రుచికి సరిపడా మోతాదులో కలిపినా ఏం ఫర్వాలేదు. ప్రస్తుతం చిన్నారి వయసు తగ్గట్టుగా బరువు ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఎక్కువ బరువుంటే కొవ్వు తీసేసిన పాలు ఇవ్వాలి. బరువు తక్కువ ఉంటే ఫుల్ క్రీమ్ పాలను చక్కెర కూడా కలిపి ఇవ్వొచ్చు. అంతేగానీ ఎక్కువ మోతాదులో పాలు ఇవ్వడం, గ్లూకోజ్ వాటర్, నీరు కలపాల్సిన అవసరం లేదు. చిన్నారి ఏడాది వయసు దాటాక.. ప్రస్తుతం మీ ఇంట్లో అనుసరిస్తున్న పద్ధతులనే వారికీ పాటించండి. మీరు తీసుకునే అహారం, పాలు పిల్లలకు ఇవ్వొచ్చు. కానీ పళ్లు ఉండవు కాబట్టి ఆహారాన్ని మెత్తగా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. పాలను అయితే నేరుగానే ఇవ్వొచ్చు.
- డాక్టర్ అపర్ణ వత్సవాయి, పీడియాట్రిషియన్