Can a Gum Infection Cause Joint Pain:చిగుళ్ల జబ్బు ఉన్నవారిలో కీళ్ల నొప్పి తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు పరిశోధకులు. ఇవి రెండూ వేర్వేరే అయినా చిగుళ్లు, కీళ్ల మధ్య అవినాభావ సంబంధం ఉంటోందని.. ఒకటి జబ్బు పడితే మరోటీ అదే దారిలో నడుస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకుంటే కీళ్లవాతం వచ్చే స్వభావం ఉన్నా జబ్బుగా మారకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండింటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంటే కీళ్ల నొప్పులను నివారించుకోవటం, తగ్గించుకోవటం సాధ్యమవుతుందని ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ ఎం వికాస్ గౌడ్ అంటున్నారు.
"చిగుళ్ల జబ్బును (పెరియోడాంటల్ డిసీజ్) చాలా మందిలో తరచుగా చూస్తుంటాం. చిగుళ్ల నుంచి రక్తం రావడం, ఉబ్బటం, నొప్పి వంటి వాటితో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవటం. ఫలితంగా పళ్లకు గార పట్టటం, మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇంకా మనం తినే ఆహార పదార్థాల ముక్కలు దంతాల మధ్యలో ఇరుక్కుపోతుంటాయి. అయితే, వీటిని సరిగా శుభ్రం చేసుకోకపోతే అక్కడ బ్యాక్టీరియా పెరిగి, పొరలా ఏర్పడుతుంది. ఫలితంగా ఇది చిగుళ్లకు, దంతాలకు గట్టిగా అతుక్కుపోతుంది. ఇంకా పొగ తాగటం, పాన్, గుట్కా నమలటం వల్ల దంతాల మీద పడే మచ్చలూ ప్రమాదంగా మారతాయి. వీటిల్లోనూ రకరకాల బ్యాక్టీరియా వృద్ధి చెంది చిగుళ్లను చికాకు పరుస్తాయి. గారలోని బ్యాక్టీరియా ఆమ్లాలను, విషతుల్యాలను ఉత్పత్తి చేసి చిగుళ్లను దెబ్బతీసి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. తొలిదశలో ఇన్‌ఫెక్షన్ చిగురుకే పరిమితమైతే (జింజివైటిస్) వాపు, ఎరుపు, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. పళ్లు తోముకునే సమయంలో చిగుళ్ల నుంచి రక్తం, నోటి దుర్వాసనా రావచ్చు. అయితే, వీటికి సరైన చికిత్స తీసుకోకపోతే సమస్య తీవ్రమై పెరియోడాంటైటిస్ తలెత్తుతుంది. తర్వాతి దశలో ఇన్‌ఫెక్షన్ దంతాలకు దన్నుగా నిలిచే కణజాలానికీ వ్యాపిస్తుంది. ఇది క్రమంగా దవడ ఎముకకూ విస్తరించే అవకాశం ఉంటుంది. ఫలితంగా చిగుళ్లకు, దంతాలకు మధ్య ఖాళీలు ఏర్పడి పళ్లు పట్టు సడలి, చివరికి ఊడిపోతాయి."
--డాక్టర్ ఎం వికాస్ గౌడ్, డెంటల్ సర్జన్
అక్కడికే పరిమితం కాదు
అయితే, చిగుళ్ల జబ్బు కేవలం నోటికి పరిమితమని అనుకోవటానికి అవకాశం లేదని పరిశోధకులు అంటున్నారు. చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌కూ గుండెజబ్బుకూ సంబంధం ఉంటున్నట్టు ఇప్పటికే అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. మధుమేహం, అల్సర్లు, కిడ్నీ జబ్బుల వంటి వాటినీ చిగుళ్ల జబ్బు ఉద్ధృతం చేస్తున్నట్టు తేలింది. వీటితో పాటు తాజాగా కీళ్ల నొప్పులకు కారణం అవుతున్నట్లు బయటపడింది. వయసు మీద పడటం వల్ల తలెత్తే మామూలు కీళ్ల నొప్పుల్లోనే కాకుండా.. మన రోగనిరోధక శక్తి మీదే దాడి చేయటం వల్ల తలెత్తే కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్) సమస్యకు దారి తీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
పరస్పర ప్రోత్సాహం
చిగుళ్లజబ్బు, కీళ్లనొప్పులు రెండూ వాపు ప్రక్రియతో ముడిపడినవేనని డాక్టర్ వికాస్ గౌడ్ తెలిపారు. వీటిల్లో శరీర రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. చిగుళ్ల జబ్బుకు కారణమయ్యే పి.జింజివలిస్ బ్యాక్టీరియాతో ప్రేరేపితమైన వాపు ప్రక్రియ కీళ్ల మీదా ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇవి రెండూ ఒకేరకం రోగనిరోధక ప్రతిస్పందన మార్గాలను కలిగి ఉంటాయని ఆయన వివరించారు. ముఖ్యంగా వాపును ప్రేరేపించే సైటోకైన్లు చిగుళ్లనే కాకుండా కీళ్లలోని కణజాలాన్నీ దెబ్బతీస్తాయని వెల్లడించారు. కీళ్లవాతం, కీళ్ల నొప్పులు ఉద్ధృతం కావటంలో దీర్ఘకాల చిగుళ్ల జబ్బు పాలు పంచుకుంటున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కీళ్లవాతం గలవారికి చిగుళ్ల జబ్బు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువని ఒక అధ్యయనం వెల్లడైంది. కీళ్లవాతం లేనివారిలో 28% మందిలో చిగుళ్ల జబ్బుతో బాధపడుతుండగా.. కీళ్లవాతం గలవారిలో 65% మంది చిగుళ్ల జబ్బుతో ఉన్నట్టు మరో అధ్యయనంలో స్పష్టమైంది. తీవ్ర చిగుళ్ల జబ్బు మూలంగా కీళ్లవాతమూ ఉద్ధృతమవుతుందని.. ఇవి రెండూ పరస్పరం ప్రోత్సహించుకుంటున్నాయని అంటున్నారు.