Blood Improve Tips in Telugu:మీ శరీరంలో సరిపడా రక్తం లేక రక్తహీనతతో బాధపడుతున్నారా? దీంతో రక్తం పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే, ఆయుర్వేద పద్ధతిలో చేసే ఈ ఔషధాన్ని ప్రిపేర్ చేసుకుని తింటే రక్తం వేగంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఔషధాన్ని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
- 160 గ్రాముల ఉసిరి పెచ్చుల చూర్ణం
- 80 గ్రాముల లోహాభస్మం
- 40 గ్రాముల యష్టి మధు చూర్ణం
- 80 గ్రాముల తిప్ప తీగ చూర్ణం
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో ఉసిరి పెచ్చుల చూర్ణం, లోహాభస్మం, యష్టి మధు చూర్ణం వేసి కలపాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీళ్లు పోసి అందులో తిప్ప తీగ చూర్ణం పోసి వేడి చేసుకోవాలి.
- తిప్ప తీగ కషాయం మనం పోసిన నీటిలో 4వ వంతు వచ్చే వరకు మరిగించుకోవాలి.
- అనంతరం స్టౌ ఆఫ్ చేసి ఈ కషాయాన్ని వడపోసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు చిన్న రోలును తీసుకుని ముందుగా కలిపిన మిశ్రమాన్ని, కషాయాన్ని పోసి 15 నిమిషాల పాటు బాగా నూరాలి.
- అనంతరం అందులోనే ఒకరోజు మొత్తం నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఏడు రోజుల పాటు కషాయాన్ని, మిశ్రమాన్ని పోసి నూరి నానబెట్టుకోవాలి.
- ఇలా చేసిన తర్వాత చివరకు ముద్దలాగా తయారైన తర్వాత మాత్రలుగా చేసుకోని నీడలో ఆరబెట్టుకుంటే ఔషధం రెడీ అవుతుంది.
- ఈ మాత్రని ఉదయం, సాయంత్రం భోజనం చేసిన తర్వాత వేసుకోవాలని డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. మనకు ఉన్న రక్త హీనత శాతాన్ని బట్టి సుమారు రెండు నెలల పాటు వాడాలని సూచిస్తున్నారు.
ఉసిరి పెచ్చులు: మనలో విటమిన్ సీ లోపం వల్ల రక్త హీనత సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు. ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుందని వివరిస్తున్నారు. రక్త కణాలు ఉత్పత్తి కావడానికి ఉసిరి బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.
లోహాభస్మం: ఇది మన శరీరంలో ఐరన్ స్థాయిలు పెరగడానికి ఎంతో సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తం పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.