How To Remove Black Heads : బ్లాక్ హెడ్స్ ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని పోగొట్టుకోవడం నిజంగా సులువైన పని మాత్రం కాదు. అంతేకాదు ఎంత ప్రయత్నించినా బ్లాక్ హెడ్స్ సమస్యను శాశ్వతంగా నయం చేసుకోలేరని చెబుతున్నారు నిపుణులు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు, పద్ధతులతో వీటి ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చట. మార్కెట్లో బ్లాక్ హెడ్స్ నయం చేసేందుకు చాలా రకాల క్రీములు దొరుకుతున్నప్పటికీ అవి మచ్చలు, ఇన్ఫెక్షన్లు, చికాకు వంటి ఇతర సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. కాబట్టి బ్లాక్ హెడ్స్ రావడానికి కారణాలు ఏంటి? ఎన్ని చోట్ల ఏర్పడతాయి? వీటిని తొలగించుకోవడం అనే విషయాలపై పూర్తి అవగాహన కోసం మీరు ఈ వార్త చదవాల్సిందే.
బ్లాక్ హెడ్స్ ఎందుకు ఏర్పడతాయి?
బ్లాక్ హెడ్స్ అనగానే కేవలం కంటి కింద కలిగే నల్లటి మచ్చలు అని అంతా అనుకుంటారు. కానీ నిజానికి బ్లాక్ హెడ్స్ అంటే కేవలం కళ్ల కింద మాత్రమే కాదు. ముఖం, శరీరంలోని ఇతర భాగాల్లో చాలా చోట్ల వస్తాయట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి కేవలం నల్లటి రంగులో మాత్రమే ఉండవు. చర్మపు రంధ్రాలు నూనె, దుమ్ము వంటి చిన్న చిన్న మృత కణాల ద్వారా మూసికిపోయినప్పుడు ఏర్పడే మురికే ఈ బ్లాక్ హెడ్స్. వీటికి బయట గాలి తాకడం వల్ల ఆక్సీకరణం చెంది నల్లగా కనిపిస్తాయి.
బ్లాక్ హెడ్స్ ఎక్కడెక్కడ ఏర్పడతాయి?
సాధారణంగా బ్లాక్ హెడ్స్ అనేవి శరీరంలో చమురు ఉత్పత్తి ఎక్కువగా ఉన్న చోట ఏర్పడతాయి. ఎక్కువ మందికి ఇవి ముక్కు చుట్టూ ఉండే ప్రాంతంలో, గడ్డం ఉండే చోట కనిపిస్తుంటాయి. దీంతో పాటుగా నుదురు, భూజాలు, వీపు, ఛాతి ప్రాంతాల్లో కూడా బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి.
వీటిని తొలగించడం ఎలా?
సాలిసిలిక్ యాసిడ్
మార్కెట్లో లభించే కొన్ని క్లీన్సర్లలో లభించే సాలిసిలిక్ యాసిడ్, చర్మంలో పేరుకుపోయిన చమురు, చనిపోయిన చర్మ కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ వాష్‌ను ముందుగా మీరు రోజుకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. ఇది మీ ముఖానికి పడుతుంది అనిపిస్తే, సమస్య తగ్గుతుందని నమ్మకం కలిగితే క్రమంగా దీంతో రోజుకు రెండు సార్లు మీరు ముఖం కడుక్కోవచ్చు.
ఎక్స్‌ఫోలియేషన్
నిజానికి మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను ఎక్స్‌ఫోలియేషన్ పెద్దగా తగ్గించలేనప్పటికీ బ్లాక్ హెడ్స్ విషయంలో మాత్రం చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆల్ఫా, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ (AHA,BHA)లు కలిగిన పదార్థాలు బ్లాక్ హెడ్స్ సమస్యకు మంచి పరిష్కారంగా మారతాయి. ఇక్కడ ఓ ముఖ్య విషయం ఏంటంటే మీరు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసేందుకు ఉపయోగించే బ్రష్‌లు చాలా సున్నితంగా ఉండేలా చూసుకోంది. సున్నితమైన చర్మం కలిగిన వారు దీనికి కాస్త దూరంగా ఉండటమే మంచిది.