Best Tips To Make Children To Drink Milk :బలవర్థకమైన ఆహారాలలో పాలు ఒకటని చెప్పుకోవచ్చు. దీనిలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చిన్నపిల్లలు ఎదిగే క్రమంలో తప్పనిసరిగా పాలు తాగిస్తుంటారు. కానీ.. చాలా మంది పిల్లలు పాలు అంతగా రుచించక తాగడానికి ఇష్టం చూపించరు. మీ పిల్లలు కూడా ఇలాగే మారా చేస్తుంటే.. ఈ సింపుల్స్ టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా తయారు చేసి అందించండి :మీ పిల్లలు ఇష్టంగా పాలు తాగాలంటే.. రకరకాల పండ్లతో స్మూతీలు, మిల్క్షేక్స్గా తయారు చేసి అందించాలని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా వాటి రుచి మరింత పెరిగి ఇష్టంగా తాగుతారంటున్నారు. అయితే, వాటిని ప్రిపేర్ చేసేటప్పుడు పాల పరిమాణం ఎక్కువగా, పండ్ల పరిమాణం కాస్త తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా ఎక్కువ మొత్తంలో పాలు వారికి అందించవచ్చంటున్నారు. అదేవిధంగా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. వాటిని తయారు చేసేటప్పుడు చక్కెర తక్కువ మొత్తంలో ఉపయోగించేలా చూసుకోండి. ఎందుకంటే.. అధిక చక్కెర వినియోగం వల్ల ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
వెన్నతో పాటు ఇవ్వండి :కొంతమంది తల్లులు పిల్లలకు పాలను వెన్నతో కలిపి ఇవ్వరు. అందులోని కొవ్వులు బాడీలోకి చేరి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని భావిస్తారు. అయితే.. వెన్న తొలగించిన పాలు రుచికరంగా ఉండవు. అందుకే పిల్లలు తాగడానికి ఇష్టపడరు. కాబట్టి, తొలుత వారికి పాలు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు వెన్నతో ఇస్తూ.. క్రమంగా వెన్న శాతాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. ఫలితంగా పిల్లలకు పాలు రుచించడంతోపాటు కొన్ని రోజుల తర్వాత వెన్న లేని పాలను తాగడానికీ అలవాటుపడే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.
పాలల్లో చక్కెర వేసుకొని తాగుతున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?