Best Salads For Diabetics :మన ఆరోగ్యానికి సలాడ్స్ ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఎందుకంటే.. పండ్లు లేదా కూరగాయలతో తయారుచేసుకునే వీటిని తినడం ద్వారా శరీరానికి కావాల్సిన అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. డయాబెటిక్ పేషెంట్లు(Diabetics).. సలాడ్స్ తినే విషయంలో కాస్త వెనుకాడుతుంటారు. ఎందుకంటే.. అవి తినడం ద్వారా షుగర్ లెవల్స్ పెరుగుతాయనే భావనలో ఉంటారు. అయితే.. అలాంటి వారికోసం రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే సలాడ్స్, సూప్ ఐటమ్స్ తీసుకొచ్చాం! అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్వినోవా వెజిటబుల్ సలాడ్ :
కావాల్సిన పదార్థాలు :
- 1 కప్పు - ఉడికించిన క్వినోవా
- 1 కప్పు - తరిగిన కీరదోస, బెల్‌పెప్పర్స్, ఉల్లి, టమాటల మిశ్రమం
- 1/4 కప్పు - ఉడికించిన బఠానీలు
- 1 టేబుల్ స్పూన్ - నిమ్మరసం
- 1 టేబుల్ స్పూన్ - ఆలివ్ నూనె
- రుచికి సరిపడా - ఉప్పు, మిరియాల పొడి
- గార్నిష్ కోసం - కొద్దిగా తరిగిన కొత్తిమీర
తయారీ విధానం : ఇందుకోసం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఉడికించిన క్వినోవా, తరిగిన కూరగాయల మిశ్రమం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, నిమ్మరసం, ఆయిల్, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి కలుపుకొని మరల దాన్ని బాగా కలుపుకోవాలి. చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలు.. క్వినోవా వెజిటబుల్ సలాడ్ రెడీ!
అలర్ట్: ఎగ్స్ తింటే షుగర్ వస్తుందా? - పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు!
మిల్లెట్ సలాడ్ :
కావాల్సిన పదార్థాలు :
- 1 కప్పు - మిల్లెట్ (ఏదైనా రకం)
- 1 కప్పు - తరిగిన చిన్న టమాట
- 1 కప్పు - తరిగిన కీర దోస ముక్కలు
- కొద్దిగా - క్యాబేజీ, పాలకూర తరుగు
- అరకప్పు - బెల్ పెప్పర్ ముక్కలు
- 1/4 కప్పు - తరిగిన పుదీనా ఆకులు
- 1/4 కప్పు - ఫెటా చీజ్ ముక్కలు(ఆప్షనల్)
- 1/4 కప్పు - ఆకుపచ్చ/నలుపు ఆలివ్ ముక్కలు(ఆప్షనల్)
- కొద్దిగా - నిమ్మరసం
- 3 టేబుల్ స్పూన్లు - ఆలివ్ నూనె
తయారీ విధానం :
- ముందుగా మీకు నచ్చిన మిల్లెట్‌ను ఒక కప్పు తీసుకోవాలి. ఆపై అందులో వాటర్, ఉప్పు వేసి మిల్లెట్ మృదువుగా అయ్యే వరకు 15-20 నిమిషాలు ఉడికించుకొని చల్లబర్చుకోవాలి.
- ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో పైన పేర్కొన్న సలాడ్‌కు సంబంధించిన కూరగాయలు, చల్లార్చుకున్న మిల్లెట్ వేసి మిక్స్ చేసుకోవాలి.
- ఇప్పుడు మరో చిన్న బౌల్లో నిమ్మరసం, ఆలివ్ నూనె, ఉప్పు, మిరియాల పొడి తీసుకొని కలుపుకోవాలి. ఆపై దాన్ని సలాడ్ మిశ్రమంలో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఒకవేళ మీరు ఫెటా చీజ్, ఆలివ్ ముక్కలు యూజ్ చేస్తుంటే తర్వాత పైన యాడ్ చేసుకోండి. చివరగా పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోండి. అంతే.. మిల్లెట్ సలాడ్ రెసిపీ రెడీ!
మూంగ్ దాల్ వెజిటబుల్ సూప్:
కావాల్సిన పదార్థాలు :
- 1 కప్పు - పెసరపప్పు(6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి)
- 1 కప్పు - సొరకాయ ముక్కలు
- టమాట - 1
- 4 కప్పుల - నీరు
- 1 టీస్పూన్ - పసుపు
- 1 టీస్పూన్ - జీలకర్ర
- అర టీస్పూన్ - మిరియాల పొడి
- పావు టీస్పూన్ - అల్లం
- 1 టేబుల్ స్పూన్ - నెయ్యి
- రుచికి సరిపడా - ఉప్పు
- గార్నిష్ కోసం - కొత్తిమీర తరుగు
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్లో నానబెట్టిన పెసరపప్పు, సోరకాయ ముక్కలను తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలి.
- మరొక పాన్‌లో నెయ్యి వేసుకొని అది కాస్త వేడి అయ్యాక జీలకర్ర, టమాట ముక్కలు, అల్లం, పసుపు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఉడికించిన పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికించిన తర్వాత కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరి.
అలర్ట్ : నోట్లో ఈ సమస్యలుంటే - షుగర్ ముప్పు ఉన్నట్టే!