Best Foods to Kids Weight Gain :నేటితరం పిల్లలు ఎక్కువగా జంక్ఫుడ్స్ తీసుకుంటున్నారు. వాటిలో పోషకాలు లేకపోగా.. పలు ఆరోగ్య సమస్యలూ తలెత్తే అవకాశం ఉంటుంది. పిల్లలు వయసుకు తగ్గ బరువు(Weight) ఉండకపోవడానికి ఇది కూడా ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మీ పిల్లలు ఉంటే.. వెంటనే వారి డైట్ మార్చేయాలని సూచిస్తున్నారు.
పిల్లలు ఎదిగే క్రమంలో సరైన ఆహారం అందించడం చాలా ముఖ్యమంటున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి. ఈ టైమ్‌లో అందించే ఫుడ్ వారి శారీరకంగా, మానసిక ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. కాబట్టి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, వయసుకు తగ్గ బరువు పెరగాలన్నా.. వారి డైట్లో సరైన పోషకాహారం ఉండేలా చూసుకోవాలంటున్నారు. చాలా మంది పిల్లలు స్కూల్‌కి వెళ్లేటప్పుడు టైమ్ అవుతుందనో, ఇంకేదైనా కారణం చేతనో టిఫిన్ తినడం మానేస్తుంటారు. కానీ, పిల్లలు ఎదిగే క్రమంలో అల్ఫాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. అది రోజు మొత్తానికి కావాల్సిన పోషకాలనూ, శక్తినీ అందిస్తుంది. అయితే, ఆ టిఫిన్‌లో కూడా తగిన పోషకాలు ఉండేలా చూసుకోవాలంటున్నారు.
మీ పిల్లలకు టిఫిన్‌గా ఇడ్లీ, దోసె పెడుతున్నట్లయితే.. క్యారెట్ తురుము, బఠాణీలనీ ఇడ్లీపిండిలో కలిపి ఉడికిస్తే మంచిదట. అలాగే.. దోసె పిండిలో కాయగూరలు, ఆకుకూరలు కలిపి వేస్తే కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతున్నారు. వీటితో పాటు డైలీ గుడ్డు, పాలు కూడా ఇవ్వాలి. అదేవిధంగా రోజూ ఒక కప్పు సీజనల్ పండ్లను ఇవ్వాలి. చిరుతిండిగా నట్స్ పెట్టేలా చూసుకోవాలి. వీలైనంత వరకు మోతాదుకి మించకుండా మూడుపూటలా ఆహారం, రెండుసార్లు స్నాక్స్ అందేలా చూసుకోవాలంటున్నారు డాక్టర్ లతాశశి.
మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా? - పేరెంట్స్‌గా మీరు ఇవి పాటించాల్సిందే!