Benefits Of Outdoor Play For Kids : మీ పిల్లలు మూడేళ్ల వారైనా, పదేళ్ల వారైనా సరే వారిని ఎప్పుడూ ఇంట్లోనే ఉంచితే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టే. ఈ మధ్య ఏ ఇంట్లో చూసినా పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు అంటూ పూర్తిగా ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. నిజానికి ఇవి పిల్లల మెదడు, శారీరక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ విషయం తెలిసినా తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వాటికి బదులుగా రోజులో కనీసం కాసేపైనా పిల్లలు బయట ఆడుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం లాంటివి చేసేలా వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఇది మీ బిడ్డల ఆరోగ్యానికి చాలా మంచిది.
ఎక్కడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి ముందు పిల్లలు ఆడుకునేంత స్థలం ఉండటం లేదని మిమ్మల్ని మీరే సమర్థించుకోకండి. ఇంటికి దగ్గర్లో కచ్చితంగా ఏదో ఒక చిన్న పార్కయినా ఉండే ఉంటుంది. అక్కడికి వారిని తీసుకెళ్లి వారిని ఆడుకునేలా చేయండి. ఇవన్నీ ఎందుకు అంటే, మీ పిల్లలు బయట ఆడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు మరీ. అవేంటో మీరే వివరంగా తెలుసుకోండి
శారీరక వ్యాయామం
ఆరుబయట ఆటల్లో పిల్లలు చేసే రన్నింగ్, జంపింగ్, ఎగరడం లాంటివి చేస్తుంటారు. ఇవి వారికి శారీరక వ్యాయామాలుగా పనిచేస్తాయి. దీంతో పిల్లల గ్రాస్ మోటార్ స్కిల్స్ పెరిగి ఆరోగ్యకరమైన బరువును పొందుతారు.
విటమిన్-డీ
పిల్లలు బయట ఆడుకోవడం వల్ల వారి శరీరానికి విటమిన్-డీ నేరుగా అందుతుంది. ఇది వారి ఎముకల ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని, మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
నైపుణ్యాలు పెంపొందిస్తుంది
ఆటల్లో పడి పిల్లలు ఊగడం, బాలెన్స్ చేసుకోవడం, విసరడం, ఎగరడం లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ వారిలో సమతుల్యతను, సమన్వయాన్ని, నైపుణ్యాలను పెంపొందిస్తాయి.
రోగనిరోధక వ్యవస్థ
బయట తిరగడం, బయట గాలి, దుమ్ముకు అలవాటు పడటం వల్ల వారిలో త్వరగా జబ్బులు రావు. ఆరుబయట ఆటలు వారి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఒత్తిడిని తగ్గిస్తాయి
కేవలం పెద్దలకే కాదు పిల్లలకు కూడా మానసిక ఒత్తిడి ఉంటుంది. అది వారి చదువుల విషయంలో అయినా, లేక ఇంకేదైనా విషయంలో అయినా కలుగుతుండొచ్చు. అలాంటి సమయంలో బయట ఆడుకుంటే పిల్లలు ఒత్తిడిని మర్చిపోయి ప్రశాంతంగా, హాయిగా ఉండగలుగుతారు.