What Happens If You Put Oil On Hair At Night :మనం అందంగా కనిపించడంలో జుట్టు కూడా కీలకపాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత రోజుల్లో చాలా మంది కేశ సంరక్షణ కోసం వివిధ జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందులో భాగంగానే రాత్రి నిద్రపోయే ముందు జుట్టుకు నూనె పెట్టుకొని పడుకుంటారు. ఎందుకంటే.. ఎంత ఎక్కువ సేపు నూనెతో ఉంటే అన్ని పోషకాలు జుట్టుకు(Hair)అందుతాయని భావిస్తారు. దాంతో వెంట్రుకలు బలంగా మారుతాయని నమ్ముతారు. అయితే, రాత్రిపూట జుట్టుకు నూనె రాయడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదు అంటే మాత్రం మీరు ఈ స్టోరీ చదవాల్సిందే!
నిజానికి జుట్టు ఆరోగ్యానికి నూనె ఎంతగానో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. అదేవిధంగా రాత్రిపూట జుట్టుకు ఆయిల్ పెట్టడం కూడా హెయిర్ సంరక్షణకు చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు. అంతేకాదు.. నైట్ టైమ్ హెయిర్‌కు ఆయిల్ అప్లై చేయడం వల్ల పలు ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. వాటిలో కొన్నింటిని చూస్తే..
జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది : సరైన పోషణ లేకపోతే చర్మం మాదిరిగానే జుట్టు కూడా డ్రైగా మారుతుంది. అయితే, అలాంటి సమస్య తలెత్తకుండా ఉండడంలో జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఆయిల్ పెట్టడం వల్ల కుదుళ్లకు మంచి పోషణ లభిస్తుంది. దాంతో జుట్టు హెడ్రేట్గా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా తయారవుతుందంటున్నారు.
2016లో "International Journal of Dermatology"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట హెయిర్‌కు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సౌదీ ఆరేబియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఇస్మతుల్లా ఖాన్ పాల్గొన్నారు. నైట్ టైమ్ జుట్టుకు కొబ్బరినూనె పెట్టుకోవడం వల్ల అందులోని పోషకాలు జుట్టును ఆరోగ్యంగా, తేమగా ఉంచడానికి సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.