Ayurveda Tips To Reduce Bad Cholesterol : ఆరోగ్యం అనేది మన శరీరంలోని అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మనం రోజూ తీసుకునే ఆహారం కూడా వీటిల్లో ఒకటి. అయితే తినే ఆహారం ద్వారా మన శరీరానికి రెండు రకాల కొలెస్ట్రాల్స్ అందుతాయి. అవి ఎల్డీఎల్(లో డెన్సిటీ లైపోప్రోటీన్) కొలెస్ట్రాల్, హెచ్‌డీఎల్(హై డెన్సిటీ లైపోప్రోటీన్) కొలెస్ట్రాల్. వీటినే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా చెబుతారు. మంచి కొవ్వు శరీరానికి మంచి చేసినా, చెడు కొవ్వు వల్ల కలిగే దుష్ఫలితాలు మాత్రం మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ నేపథ్యంలో మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను ఆయుర్వేదంలోని చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
శరీరానికి ఈ కొలెస్ట్రాల్ అవసరం
శరీరంలోని ప్రతి భాగానికి రక్త ప్రసరణ అవసరం. శరీరంలోని ధమనులు రక్తాన్ని శుద్ధి చేసి గుండె నుంచి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి. అయితే ఎల్డీఎల్(చెడు కొవ్వు) అనేది రక్తనాళాలు, ధమనుల్లో పేరుకుపోయి రక్తప్రవాహానికి అడ్డుగా మారుతుంది. అందుకే దీనిని చెడు కొలెస్ట్రాల్‌గా చెబుతారు. శరీరంలో ఏర్పడే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆయుర్వేదంలో కొన్ని రకాల ఔషధాలు, ఉపాయాలను సూచిస్తున్నారు వైద్యులు.
త్రిఫల చూర్ణం
ఉసిరి, కరక్కాయ, తాని కాయలను చూర్ణం చేస్తే త్రిఫల చూర్ణం తయారవుతుంది. దీనిని తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చెయ్యడమే కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
వెల్లుల్లి
భారతీయ వంటకాల్లో ఎన్నో శతాబ్దాలుగా వాడుతున్న వెల్లుల్లి వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. పచ్చి వెల్లుల్లిని లేదంటే వెల్లుల్లితో చేసిన ఆహారాన్ని తినడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నివారించవచ్చు.
పసుపు
భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా వాడే పసుపు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తితో పాటు యాంటీ బయాటిక్‌గా పని చేసే పసుపును వాడటం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
గుగ్గల్
బర్సెరేసి కుటుంబానికి చెందిన కామిఫోరా ముకుల్ అనే చెట్టు ద్వారా గుగ్గల్ అనే పదార్థాన్ని సేకరిస్తారు. దీనిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. మాత్రలు లేదా క్యాప్సూల్స్ రూపంలో వీటిని తీసుకోవచ్చు.