Avoid These Foods in Summer : సమ్మర్లో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అసలే ఎండాకాలం బయట ఉష్ణోగ్రతలకు శరీరంలో వేడిమి క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో బాగా మసాలా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే అవి బాడీలో మరింత వేడిని పెంచి నీటి శాతాన్ని తగ్గించే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఫలితంగా జీర్ణ సమస్యలకు దారితీయవచ్చంటున్నారు. కాబట్టి వేసవిలో స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.
2017లో 'జర్నల్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపాటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. వేసవిలో స్పైసీ ఫుడ్స్ తినే వ్యక్తులలో కడుపులో మంట, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న దిల్లీకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ రాజేష్ కుమార్.. ఎండాకాలం మసాలా ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అని పేర్కొన్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు : వేసవిలో మీరు దూరంగా ఉండాల్సిన మరో ఫుడ్ ఐటమ్.. ప్రాసెస్ చేసిన ఆహారాలు. వీటిలో తక్కువ పోషకాలు ఉండడమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని అందించలేవు. ముఖ్యంగా వీటిలో అధిక సోడియం ఉంటుంది. ఫలితంగా ఎక్కువ దాహాన్ని కలిగించడమే కాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ వంటి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు.
వేయించిన ఆహారాలు : ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి అన్ని సీజన్లలో వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా వేసవిలో ఈ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు. సాధారణంగా వీటిలో లవణాలు, ఇతర మసాలాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు లైనింగ్‌ను దెబ్బ తీయడమే కాకుండా అజీర్ణానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. అలాగే.. మొటిమలు వంటి చర్మ సమస్యలను కలిగిస్తాయని చెబుతున్నారు.